Kavitha : ఎనిమిదేళ్లుగా ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులు: కవిత విసుర్లు

ఎనిమిదేళ్లుగా ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు. కేంద్ర-రాష్ట్రాల సమన్వయం లేకపోవడమే ఆలస్యానికి కారణం అని కవిత మండిపాటు.

Kavitha

విధాత, హైదరాబాద్ : నిత్యం ఎంతో రద్దీగా ఉండే వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి మార్గంలోని ఉప్పల్ ఫ్లై ఓవర్ ను 8 ఏళ్లుగా కడుతూనే ఉన్నారని, ప్రభుత్వాలు మారుతున్నాయి..కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన కవిత పనుల ఆలస్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ ఉప్పల్ హైవే అంశంపై శాసన మండలిలో ప్రశ్నిస్తే…మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించి, త్వరలోనే సమీక్ష చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని..ఆ తర్వాత కాంట్రాక్టర్ ను మార్చారో లేదో తెలియదు కానీ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉందన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవటానికి మేము ఇక్కడకు వచ్చాం అని తెలిపారు. ఘట్ కేసర్ వరకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నిర్మిస్తున్న ఈ ఫ్లైవోవర్ ను 8 ఏళ్లుగా కడుతున్నారంటే ప్రజల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ది ఉందో తెలుస్తోందని విమర్శించారు.

కేంద, రాష్ట్రాల మధ్య సమన్వయం లేకనే ఆలస్యం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవటం కారణంగానే నిర్మాణ పనుల్లో జాప్యం జరగుతుందని కవిత ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ఎంపీ ఈటల రాజేందర్ ఇక్కడకు వచ్చి పరిస్థితిని చూడాలని, సెంట్రల్ ప్రాజెక్ట్ కనుక బీజేపీ ఎంపీ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడకు వచ్చి నిరసన తెలిపి వెంటపడి పనులు చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, లేదంటే మా సంస్థ తరఫున మేమే ప్రభుత్వం వెంట పడి పనులు చేయిస్తాం అని కవిత స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Ram Attack Student : పొట్టేలుతో ఆట..సచ్చాంరో బాబోయ్
Russian Dancers Viral Video : పుతిన్ భారత్ పర్యటన..అదరగొట్టిన రష్యన్ డాన్సర్స్

Latest News