విధాత, హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు పతంగుల సందడి మొదలైన వేళ…ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో చైనా మాంజా అమ్ముతున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే రూ.5 వేల బహుమతి ప్రకటించారు. ఎక్కడైన చైనా మాంజా అమ్ముతుంటే.. ఆ వివరాలు అందించిన వాళ్లకు రూ.5వేలు ఇస్తామని..మాంజా అమ్మినోళ్లపై కేసులు పెట్టిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. చిన్న షాపులైనా, పెద్ద షాపులైనా కూడా ఎవరూ కూడా చైనా మాంజా అమ్మవద్దని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘించి మాంజా అమ్ముతున్న ఎవరిపైనైనా కేసులు తప్పవన్నారు. ఎవరు కూడా చైనా మాంజా విక్రయించ వద్దు అని కోరారు. చైనా మాంజాతో ప్రతి ఏటా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని..ఎన్నో కుటుంబాలు తద్వారా ఇబ్బందుల్లో పడుతున్నాయని నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కూడా చైనా మాంజా అమ్మరాదని ఇప్పటికే ప్రభుత్వం నిషేధం విధించిందని గుర్తు చేశారు.
చైనా మాంజా కేవలం దారం కాదు.. అది ఒక మృత్యుపాశం. దీనివల్ల అమాయక పక్షులు గాలిలో ప్రాణాలు వదులుతున్నాయి. బైక్‌లపై వెళ్లే ప్రయాణికుల మెడకు తట్టుకుని తీవ్ర గాయాలపాలవుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులతో పాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏ రకమైన దారాన్ని వాడుతున్నారో గమనించాలని దానం కోరారు. పర్యావరణానికి, ప్రాణాలకు హాని కలిగించే వస్తువులను బహిష్కరించి, పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజల ప్రాణరక్షణ కూడా అంతే ముఖ్యమని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు, స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు.
మరో యువకుడి గొంతు కోసిన చైనా మాంజా
హైదరాబాద్‌లోని శంషీర్‌గంజ్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న జమీల్ అనే యువకుడి మెడకు చైనా మాంజా తగిలి గొంతు కోసుకపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే చికిత్స కోసం జమీల్‌ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
ఇవి కూడా చదవండి :
AP New Districts List : ఏపీలో 28 జిల్లాలకు కేబినెట్ ఆమోదం
ATM Fraud | వామ్మో.. ఏటీఎం నుంచి ఇలా కూడా డబ్బులు కొట్టేస్తారా?
