Maganti Malini Devi : మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీ దేవి ఎక్కడ..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మొదటి భార్య 'మాలినీ దేవి' ఎక్కడ ఉన్నారనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ అభ్యర్థి రెండో భార్య సునీతపై ఆమె కొడుకు ఫిర్యాదు చేసినా మాలినీ దేవి మాత్రం మౌనంగా ఉండటం బయటకు రాకపోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

Maganti Gopinath First Wife Malini Devi

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యవహారం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుటుంబంలోని వివాదాలను రచ్చకెక్కించింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాగంటి గోపినాథ్ సతీమణి సునీత అసలు ఆయన చట్టబద్దమైన భార్య కాదంటూ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న కొసరాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. అసలు మాగంటి గోపినాథ్ మొదటి భార్య ఎవరు..సునీతపై ఫిర్యాదు చేసిన మొదటి భార్య కొడుకు అమెరికాలో ఉంటూ.. తన తండ్రి అంత్యక్రియలకు రాకపోవడం ఏమిటన్న ప్రశ్నలు సర్వాత్రా నెలకొన్నాయి.

అయితే మాగంటి గోపినాథ్ మొదటి భార్య మాలినీ దేవి వివరాలు ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మాలినీ దేవి బయటకొస్తే సునీత అభ్యర్థిత్వం లీగల్‌గా నిలవదనే భయం బీఆర్ఎస్‌ను కుదిపేస్తోంది. ఆమె బయటకొస్తే బీఆర్ఎస్‌ అభ్యర్థి సునీత వివాదం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారవచ్చని ప్రత్యర్ధి పార్టీలు అంచనా వేస్తున్నాయి. అయితే మాలినీ దేవి మాత్రం ఇప్పటివరకు ఈ వివాదంపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకపోగా..తను ఎక్కడ ఉన్నారన్న అంశం కూడా వెల్లడించలేదు. తన కొడుకు సవతి తల్లి సునీతపై బహింరంగ పంచాయతీ చేస్తున్నప్పటికి మాలినీ దేవి ఎందుకు బయటకు రావట్లేదు అన్న ప్రశ్న ఆసక్తి రేపుతుంది. ఆమెను బయటకు రాకుండా బీఆర్ఎస్ వారే అడ్డుపడుతున్నారన్న చర్చ నియోజకవర్గ రాజకీయాల్లో వినిపిస్తుంది. అసలే గోపినాథ్ మరణంతో సానుభూతి పవనాల ఆసరాతో ఉప ఎన్నికల నుంచి గట్టెక్కాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు మాగంటి గోపినాథ్ కుటుంబ వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది.