ఇండోనేసియాలోని చైనా నిర్మిత ప్లాంట్‌లో అగ్నిప్ర‌మాదం.. 13 మంది మృతి

  • Publish Date - December 24, 2023 / 09:50 AM IST

ఇండోనేసియా (Indonesia) లోని ఓ ప‌రిశ్ర‌మ‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఇక్క‌డ జ‌రిగిన ఓ పేలుడులో క‌నీసం 13 మంది స‌జీవ‌ద‌హ‌నం (Fire Accident) కాగా 38 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆదివారం ఉద‌యం ఈ దుర్ఘ‌ట‌న జ‌ర‌గిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. నికెల్ లోహాన్ని ప్రాసెసింగ్ చేసే ఈ కెమిక‌ల్ ప‌రిశ్ర‌మ‌ను చైనా నిర్మించిన‌ట్లు తెలుస్తోంది.

చ‌నిపోయిన వారిలో అయిదుగురు చైనీయులు కూడా ఉన్నార‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది. సులావేసీ అనే ద్వీపంలో ఉన్న ఈ ప్లాంట్‌.. ఇండోనేసియాలో విరివిగా దొరికే నికెల్‌ను ప్రాసెస్ చేస్తుంది. ఈవీ బ్యాట‌రీలు, స్టెయిన్ స్టీల్‌కు డిమాండ్ బాగా పెరిగిన నేప‌థ్యంలో ఈ సంస్థ త‌న ఉత్ప‌త్తిని భారీ స్థాయిలో పెంచింది. దీంతో చైనా సాయంతో సంస్థ యాజ‌మాన్యం ప్లాంట్‌ను విస్త‌రించింది. అయితే ఈ ప‌రిణామాల త‌ర్వాత కార్మికుల ప‌రిస్థితి ఘోరంగా త‌యారైంది విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప‌ని స్థ‌లంలో భ‌ద్ర‌త లేద‌ని.. స‌రైన ప్ర‌మాణాలు పాటించ‌డం లేద‌ని ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఎప్ప‌టి నుంచో పోరాటం చేస్తున్నాయి.


ఆదివారం జ‌రిగిన ప్ర‌మాదానికి సంబంధించి.. ఫ‌ర్నేస్‌ను మ‌ర‌మ్మ‌తు చేస్తుండ‌గా మండే స్వ‌భావం ఉన్న ఓ ప‌దార్థానికి మంట‌లు అంటుకున్నాయి. ఇవి క్ర‌మంగా ప‌క్కనే ఉన్న ఆక్సిజ‌న్ ట్యాంకుకు అంటుకుని భారీ పేలుడు సంభ‌వించింది. కొద్ది సేప‌టికి సిబ్బంది స్పందించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. త‌మ ముఖాలు కాలిపోయాయి.. ఒంటిపై నూలు పోగు కూడా మిగ‌ల్లేదు అని ఒక కార్మికుడు చెప్పిన‌ట్లు ఏఎఫ్‌పీ వార్తా స్థంస్థ వెల్ల‌డించింది. ఇండోనేసియా పరిశ్ర‌మ‌ల్లో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు ఉండ‌వ‌ని.. నిబంధ‌న‌లను య‌థేచ్ఛ‌గా ఉల్లంఘిస్తార‌ని ఆరోప‌ణ‌లు విన‌ప‌డుతూ ఉంటాయి.

Latest News