బాలుడి ప్రాణాన్ని బ‌లిగొన్న మాల్దీవ్స్ అధ్య‌క్షుడి భార‌త వ్య‌తిరేక‌త‌

మాల్దీవ్స్ (Maldives) అధ్య‌క్షుడి భార‌త వ్య‌తిరేక‌త ఆ దేశంలో ఒక నిండు ప్రాణాన్ని బ‌లిగొంది. ఎయిర్ అంబులెన్స్‌గా ఉప‌యోగ‌ప‌డుతున్న భార‌త డోర్నియ‌ర్

  • Publish Date - January 21, 2024 / 08:12 AM IST

మాల్దీవ్స్ (Maldives) అధ్య‌క్షుడి భార‌త వ్య‌తిరేక‌త ఆ దేశంలో ఒక నిండు ప్రాణాన్ని బ‌లిగొంది. ఎయిర్ అంబులెన్స్‌గా ఉప‌యోగ‌ప‌డుతున్న భార‌త డోర్నియ‌ర్ (Indian Plane) విమానానికి అక్క‌డి అధికారులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో.. అత్య‌వ‌స‌ర చికిత్స అంద‌క‌ 14 ఏళ్ల బాలుడు మృత్యువాత ప‌డ్డాడు. కొన్ని దీవుల స‌ముదాయంగా ఉండే మాల్దీవ్స్‌లో.. రాజ‌ధాని మాలిలో మాత్ర‌మే సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రులు ఉన్నాయి. మారుమూల దీవుల్లో ఉన్న వారికి అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు, ప్రాణాపాయంలో ఉన్న రోగుల‌కు ఎయిర్ అంబులెన్స్‌లు కావాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం గ‌తంలో విజ్ఞ‌ప్తి చేసింది. దీంతో భార‌త్ ప్ర‌భుత్వం అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్ట‌ర్ శ్రేణికి చెందిన రెండు డోర్నియ‌ర్ విమానాల‌ను సాయంగా అందించింది. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం వ‌చ్చే వ‌ర‌కు కూడా ఇవి నిరంత‌రం దీవుల మ‌ధ్య తిరుగుతూ ఎయిర్ అంబులెన్స్‌లుగా ఉప‌యోగ‌పడేవి. అయితే ఇటీవ‌ల‌ అధ్య‌క్షుడిగా ఎన్నికైన మొయిజ్జు (Muizzu’s) కు భార‌త వ్య‌తిరేకిగా పేరుంది. త‌మ దేశంలో ఉన్న 70 మంది భార‌త సైనికులు దేశం విడిచి వెళ్లిపోవాల‌ని, వారి విమానాలు, హెలికాప్ట‌ర్‌లు, నౌక‌ల‌ను త‌మ భూభాగం నుంచి త‌ర‌లించాల‌ని ఇప్ప‌టికే ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా.. గాఫ్ అలీ విల్లింగ్‌లీ అనే ప్రాంతంలో నివ‌సించే 14 ఏళ్ల బాలుడు బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాడు. హ‌ఠాత్తుగా అత‌డికి బ్రెయిన్ స్ట్రోక్ రావ‌డంతో మాలీకి ఎయిర్ అంబులెన్స్ కావాల‌ని స్థానిక అధికారుల‌కు బాలుడి త‌ల్లిదండ్రులు విజ్ఞ‌ప్తి చేశారు. మ‌ళ్లీ స్పందిస్తామ‌ని చెప్పిన అధికారులు కొన్ని గంట‌లైన స్పందించ‌లేదు. ‘మేము ఏవియేష‌న్ అధికారుల‌కు ఫోన్ చేసి ఎయిర్ అంబులెన్స్ అత్య‌వ‌స‌ర‌మ‌ని విజ్ఞ‌ప్తి చేశాం. బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చిన వెంట‌నే మాలీలోని ఆసుప‌త్రికి వెళ్లాల్సి ఉంది. అయితే అధికారులు చాలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో మా కుమారుణ్ని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌డానికి 16 గంట‌ల‌కు ప‌ట్టింది. ఇప్పుడు అత‌డు మ‌న మ‌ధ్య లేడు. దీనికి అధికారుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణం’ అని బాలుడి తండ్రి చెప్పిన‌ట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది. అధికారుల వైఖ‌రికి కార‌ణం.. దేశ ప్ర‌భుత్వ విధానంలో వ‌చ్చిన భార‌త వ్య‌తిరేక విధాన‌మే కార‌ణ‌మ‌ని ఆరోప‌ణ‌లు చేసింది. ఎయిర్ అంబులెన్స్‌లుగా ఉన్న‌వి భార‌త్‌కు చెందిన విమానాలు కావ‌డంతో.. అధికారులు ఎటూ తేల్చుకోలేక ఎగ‌ర‌డానికి అనుమ‌తులు ఇవ్వ‌క‌పోయి ఉండొచ్చ‌ని ఒక అధికారి వెల్ల‌డించారు. ‘అధ్య‌క్షుడి భార‌త వ్య‌తిరేక‌త‌ను స‌మ‌ర్థించ‌డానికి, గౌర‌వించ‌డానికి దేశ ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోవాలా??’అని స్థానిక ఎంపీ మీకాలీ నాసిమ్ ప్ర‌శ్నించారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్షాలు వ‌రుస విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

Latest News