B-21 Raider | అమెరికా వైమానిక దళంలోకి ఇంకో బి21 రైడర్ చేరింది. తన అత్యంత ప్రతిష్టాత్మకమైన అణు బాంబర్ – బి-21 రైడర్ ఇప్పుడు జంటగా మారింది. సెప్టెంబర్ 11న కాలిఫోర్నియాలోని పాల్మ్‌డేల్ నుంచి గాల్లోకి లేచిన ఈ రెండో విమానం ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే తొలి ఆరవ తరం (Sixth Generation) స్టెల్త్ బాంబర్గా గుర్తింపు పొందిన ఈ విమానం, అమెరికా దీర్ఘకాల వ్యూహాత్మక గగనతల ఆధిపత్యానికి ప్రతీకగా నిలవబోతోంది.
B-21 రైడర్ ఒకేసారి అణు బాంబులు, సాధారణ బాంబులు రెండింటితో కలిపి 30,000 పౌండ్ల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. పటిష్టమైన రక్షణ వ్యవస్థలపైన కూడా భీకర దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇది పాత B-1B లాన్సర్, B-2 స్పిరిట్ బాంబర్లకు వారసుడిగా రూపుదిద్దుకుంది. అమెరికా కనీసం వంద బి21లు ఆర్డర్ చేసే ప్రణాళికలో ఉంది. భవిష్యత్తులో వీటితో పాటు ఆధునికీకరించిన B-52J స్ట్రాటోఫోర్ట్రెస్ కూడా వాడుకలో ఉంటుంది.
ఇప్పటివరకు ఒకే విమానం ఉండటంతో కేవలం ప్రాథమిక పనితీరు మాత్రమే పరీక్షించబడింది. ఇప్పుడు రెండో విమానం వచ్చి చేరడంతో యాంత్రిక వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, ఆయుధ ప్రయోగం వంటి తదుపరి దశలకు పరీక్షలు విస్తరించాయి. పైలట్లు, సిములేటర్‌లో ఉన్నట్లే ఉంది అని పేర్కొనడం గమనార్హం. ఇది డిజిటల్ ఇంజనీరింగ్, ఆగుమెంటెడ్ రియాలిటీ టూల్స్ వాడకంతో సాధ్యమైంది.
నార్త్రోప్ గ్రుమ్మన్(Northrop Grumman) నిర్మించిన ఈ విమానం ఓపెన్ ఆర్కిటెక్చర్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా రూపుదిద్దుకుంది. దీని వల్ల భవిష్యత్తులో కొత్త సెన్సర్లు, ఆయుధ వ్యవస్థలు సులభంగా అమర్చుకోవచ్చు. అజైల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, అత్యాధునిక తయారీ పద్ధతులు ఉపయోగించడం వల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గి, సమయం ఆదా అవుతోంది. 2026 నాటికి ఎల్స్‌వర్త్ ఎయిర్ బేస్ (South Dakota) మొదటగా ఈ బాంబర్లను తన దళంలో చేర్చుకుంటుంది. తరువాత మిస్సోరిలోని వైట్మాన్, టెక్సాస్‌లోని డైస్ ఎయిర్ బేస్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం కొత్త హ్యాంగర్లు, శిక్షణ కేంద్రాలు, సాంకేతిక మౌలికవసతుల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. B-21 రైడర్ ప్రవేశంతో అమెరికా అణ్వాయుధశక్తి మరింత బలపడనుంది. చైనా, రష్యా వంటి దేశాల ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థలను సైతం తుత్తునియలు చేస్తూ భారీ లోతుల్లోకి కూడా దాడులు చేయగల సామర్థ్యం దీనికి ఉంది. “ఇది కేవలం బాంబర్ కాదు, భవిష్యత్తు యుద్ధ వ్యూహాన్ని మార్చే గేమ్‌చేంజర్” అని ఎయిర్ ఫోర్స్ చీఫ్ డేవిడ్ ఆల్‌విన్ వ్యాఖ్యానించారు.
పాత బి-2 స్పిరిట్ ఒక్కో విమానం నిర్మాణానికి దాదాపు 200 కోట్ల డాలర్లు ఖర్చయినా, కొత్త బి-21 రైడర్ మాత్రం తక్కువ ఖర్చుతోనే(80 కోట్ల డాలర్లు) తయారుచేయగలిగారు. తక్కువ ఖర్చుతో వీటిని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయడం దీని ప్రధాన లక్ష్యం. అమెరికా కనీసం వంద విమానాలనైనా తయారుచేయాలనే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ బాంబర్ మానవ సహితంగా లేదా రహితంగా అంటే, డ్రోన్ మోడ్‌లోనూ పనిచేయగలదు. అమెరికా దీన్ని ఒక యుద్ధ విమానంలా కాకుండా, మొత్తం యుద్ధ వ్యవస్థలా(ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, కమ్యూనికేషన్స్) వాడాలనే ఆలోచనలో ఉంది. దీని ద్వారా రాబోయే దశాబ్దాల్లో అమెరికా తన గగనతల ఆధిపత్యాన్ని కొనసాగించనుంది.
B-2 స్పిరిట్ ప్రవేశంతో మూడు దశాబ్దాల క్రితం స్టెల్త్ యుగాన్ని ఆరంభించిన అమెరికా, ఇప్పుడు B-21 రైడర్తో మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది కేవలం యుద్ధ విమానం కాదు, అమెరికా వ్యూహాత్మక గగనతల ఆధిపత్యానికి మూలస్తంభం. రాబోయే రెండు మూడు దశాబ్దాల్లో ప్రపంచ ఆయుధ సమీకరణల్లో B-21 కీలక పాత్ర పోషించనుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.