విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థుల మృతి

దూరపు కొండలు నునుపు అని చాలామంది ఉన్నత విద్య కోసం స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళుతుంటారు. అక్క‌డికి వెళ్లి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని విదేశాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు

  • Publish Date - December 9, 2023 / 12:37 PM IST

– ఐదేళ్ల నివేదిక వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

విధాత‌: దూరపు కొండలు నునుపు అని చాలామంది ఉన్నత విద్య కోసం స్వదేశాన్ని వదిలి విదేశాలకు వెళుతుంటారు. అక్క‌డికి వెళ్లి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని విదేశాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఎన్నో ఆశ‌ల‌తో విదేశాల్లో అడుగుపెట్టిన‌ విద్యార్థుల్లో కొందరు అనుకోని కారణాల వ‌ల్ల అసువులు బాస్తున్నారు.

గత ఐదేళ్లలో భార‌త్ నుంచి విదేశాల‌కు వెళ్లిన విద్యార్థుల్లో దాదాపు 403 మంది మృతి చెందిన‌ట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి.. ఇలా పలు కారణాలతో విద్యార్థులు మరణిస్తున్నట్లు ఆ నివేదిక‌లో తెలిపింది. ఇలా మ‌ర‌ణించిన వారిలో అత్యధిక మరణాలు కెనడాలోనే జరిగినట్లు పేర్కొన్న‌ది. ఈనివేదికను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ లిఖితపూర్వకంగా రాజ్యసభలో సమర్పించారు. అందులో 2018 నుంచి ఇప్పటివరకు మొత్తం 34 దేశాల్లో 403 మంది భారతీయులు మరణించినట్లు తెలిపారు.

అత్యధికంగా కెనడాలో..

కెనడాలోనే 91 మంది విద్యార్థులు మృతి చెందారని, ఆ తర్వాత యూకేలో 48, రష్యా లో 40, అమెరికాలో 36, ఆస్ట్రేలియాలో 35, జపాన్ లో21, జర్మనీలో 20, సైప్రస్ లో 14, ఇటలీ, ఫిలిపిన్ లో పది మంది చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలిపారు. ఇంకా కొంతమంది వివరాలు తెలియాల్సి ఉన్న‌ద‌ని కేంద్రం పేర్కొన్న‌ది.