అమెరికాపై చ‌లి పులి పంజా.. 60 మందికి పైగా మృతి

అమెరికా లో చ‌లి పులి విజృంభిస్తోంది. శీత‌ల గాలులు, ప్ర‌తికూల వాతావ‌ర‌ణం బారిన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నీసం 60 మంది మృత్యువాత ప‌డిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు

  • Publish Date - January 21, 2024 / 09:16 AM IST

అమెరికా (America) లో చ‌లి పులి (Winter Storm) విజృంభిస్తోంది. శీత‌ల గాలులు, ప్ర‌తికూల వాతావ‌ర‌ణం బారిన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నీసం 60 మంది మృత్యువాత ప‌డిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. కొన్ని వేల‌మంది నిరాశ్ర‌యుల‌య్యార‌ని.. చ‌లి ప్ర‌భావం ల‌క్ష‌ల మందిపై ఉంద‌ని తెలిపారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో వారం రోజుల పాటు ఈ గ‌డ్డ‌క‌ట్టించే గాలులు ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ‌, వాత‌వ‌ర‌ణ ప‌రిశోధ‌కులు ఆదివారం వెల్ల‌డించారు. రెండు వారాలుగా వ‌ర్షం, మంచు, చ‌ల్ల‌ని గాలులు, జీరో డిగ్రీ ఉష్ణోగ్ర‌త‌ల‌తో ఇక్క‌డి జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. చాలా చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డింది. ఇప్ప‌టికీ కొన్నిచోట్ల స‌ర‌ఫరాను అధికారులు పున‌రుద్ధ‌రించలేక‌పోయారు. చాలా మంది మ‌ర‌ణాల‌కు కార‌ణం.. విద్యుత్ కోత‌లు, రోడ్ల దుస్థితే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.


చ‌లిలో ఎక్కువ సేపు ఉండ‌టం వ‌ల్ల ఎముక‌లు కొయ్య‌బారిపోవ‌డం, హైపోథెర్మియా వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. విద్యుత్ లేక‌పోవ‌డంతో హీట‌ర్ లేక‌.. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డి మ‌ర‌ణిస్తున్నారు అని మిసిసిపీ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఇక్క‌డ శ‌నివారం ఒక్క‌రోజే ఇద్ద‌రు చ‌నిపోగా.. మ‌ర‌ణాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. టెన్నిసీ రాష్ట్రంలో క‌నీసం 19 మంది మ‌ర‌ణించారు. ఇక్క‌డ హెచ్చ‌రిక‌ల‌కు త‌గినట్లు ప్ర‌భుత్వం విప‌త్తు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని స్థానిక మీడియా పేర్కొంది. మ‌రో రాష్ట్రం ఒరెగాన్‌లో క‌నీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్క‌డి ప్ర‌భుత్వం రాష్ట్ర స్థాయిలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. ఇండియా రాష్ట్రంలో శుక్ర‌వారం .. 32 అంగుళాల ఎత్తున మంచు కురిసింది. దీంతో నాలుగు ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు నీరు, విద్యుత్ గ్యాస్ స‌ర‌ఫ‌రా లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. చాలా చోట్ల పాఠశాల‌లు ,వాణిజ్య స‌ముదాయాలు మూత ప‌డ్డాయి. కెన‌డా మీదుగా వ‌చ్చే ఆర్కిటిక్ గాలులు త‌గ్గుముఖం ప‌ట్టే వ‌ర‌కు అమెరికాలో ఈ ప‌రిస్థితి ఉంటుంద‌ని ద నేష‌న‌ల్ వెద‌ర్ స‌ర్వీస్ ప్ర‌క‌టించింది. ఆదివారం మ‌ధ్యాహ్నం నుంచి కొన్ని ప్రాంతాల్లో వెచ్చని గాలులు వీచే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొంది.