10 వేల ఏళ్ల పాటు తిరిగే గ‌డియారం.. అమెజాన్ అధిప‌తి స‌హ‌కారంతో నిర్మాణం!

అమెజాన్ అధిప‌తి జెఫ్ బెజోస్ ఒక వినూత్న ప్రాజెక్టును చేప‌ట్ట‌నున్నారు. 10 వేల ఏళ్ల పాటు తిరిగే ఒక గ‌డియారం (10,000 Year Clock) నిర్మాణంలో పెట్టుబ‌డి పెట్ట‌నున్నారు

  • Publish Date - December 17, 2023 / 11:42 AM IST

అమెజాన్ అధిప‌తి జెఫ్ బెజోస్ (Jeff Bezos) ఒక వినూత్న ప్రాజెక్టును చేప‌ట్ట‌నున్నారు. 10 వేల ఏళ్ల పాటు తిరిగే ఒక గ‌డియారం (10,000 Year Clock) నిర్మాణంలో పెట్టుబ‌డి పెట్ట‌నున్నారు. ఆయ‌న సుమారు రూ.350 కోట్ల (42 మిలియ‌న్ డాల‌ర్లు)ను దీని నిమిత్తం వెచ్చించ‌నున్నార‌ని తెలుస్తోంది. అమెరికాకు చెందిన కంప్యూట‌ర్ శాస్త్రవేత్త‌, ప‌రిశోధ‌కుడు డానీ హిల్లిస్ తొలుత ఈ గ‌డియారం ఆలోచ‌న‌ను చేశారు. 1996లో లాంగ్ నౌ ఫౌండేష‌న్‌ను ఏర్పాటు చేసి దీని నిర్మాణం కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. మాన‌వాళి ఎక్కువగా స్వ‌ల్ప‌కాల ల‌క్ష్యాల కోస‌మే ప‌ని చేస్తోంద‌ని.. దీర్ఘ‌కాల లక్ష్యాల కోసం.. భ‌విష్య‌త్తు త‌రాల కోసం పాటుప‌డాల‌నే విష‌యాన్ని గుర్తు చేయ‌డానికే ఈ గ‌డియారం నిర్మాణమ‌ని ఆయ‌న గ‌తంలో ప్ర‌క‌టించారు.


ఇప్ప‌టికే ఈ గ‌డియారం నిర్మాణాన్ని మొద‌లు పెట్టారు. అమెరికా (America) లోని టెక్సాస్‌కు ప‌శ్చిమంగా సియ‌రా డియాబ్లా ప‌ర్వ‌త శ్రేణిలో ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. కొంత మంది ఈ ఆలోచ‌నను మెచ్చుకుంటున్న‌ప్ప‌టికీ.. మ‌రికొంత మంది ఈ గ‌డియారానికి ఇంత ఖ‌ర్చు పెట్టే బ‌దులు ఇప్పుడు ప్ర‌పంచం ముందున్న స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డానికి ఆ నిధుల‌ను ఉప‌యోగించాల‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ఏమిటీ ఈ గ‌డియారం ప్ర‌త్యేక‌త‌

10 వేల ఏళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ‌డియారం ప‌ని చేస్తుంది. సాధార‌ణ గ‌డియారాల్లా నిమిషాలు, గంట‌ల లెక్క‌న ఇది ప‌ని చేయ‌దు. ఈ గ‌డియారంలో ముల్లు ఒక ఏడాది పూర్త‌వ‌గానే ముల్లు ముందుకు క‌దులుతుంది. ఒక శ‌తాబ్దం పూర్త‌వ‌గానే ఒక బీప్ శ‌బ్దం చేస్తుంది. వెయ్యేళ్లు పూర్త‌వ‌గానే ఒక ప‌క్షి బొమ్మ బ‌య‌ట‌కు వ‌చ్చి స‌మ‌యం చెప్పేలా దీనిని నిర్మిస్తున్నారు. 500 అడుగుల ఎత్తులో నిర్మితం కానున్న ఈ భారీ గ‌డియారం ఒక మెకానిక‌ల్ అద్భుత‌మ‌ని.. భూమిలో ఉండే వేడిని విద్యుచ్ఛ‌క్తిగా మార్చుకుని ప‌నిచేస్తుంద‌ని సంబంధిత వ్య‌క్తులు తెలిపారు. ఇందులో సోలార్ సింక్ర‌నైజర్‌, పెండ్యుల‌మ్‌, కైమ్ జ‌న‌రేట‌ర్‌, గేర్లు, డ‌య‌ల్స్ ఉంటాయి. ఇది నిర్విరామంగా గ‌తిస్తున్న ఏడాదుల‌ను, శ‌తాబ్దాల‌ను, స‌హ‌స్రాబ్దుల‌ను లెక్కిస్తుంది. 35 ల‌క్ష‌ల ర‌కాలైన శ‌బ్దాలు చేయ‌గ‌లిగే సామ‌ర్థ్యం ఈ గ‌డియారానికి ఉండటం వ‌ల్ల ఒక సారి చేసిన శ‌బ్దాన్నే మ‌రోసారి చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇందులోనే అంత‌ర్భాగంగా 5 ఛాంబ‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇందులో కాలానికి సంబంధించిన సందేశాలు,

ప్ర‌పంచ గ‌మ‌నంలో చోటు చేసుకున్న ముఖ్య‌మైన ఘ‌ట‌న‌ల సమాచారాన్ని పొందుప‌రుస్తారు. అయితే ఈ భారీ నిర్మాణం విజ‌య‌వంతం కావ‌డానికి కొన్ని అడ్డంకులు కూడా క‌న‌ప‌డుతున్నాయి. రానున్న 10 వేల ఏళ్ల‌లో వ‌చ్చే ఉష్ణోగ్ర‌త‌ల మార్పులు, తేమ‌, దుమ్ము ప్ర‌భావాన్ని త‌ట్టుకోవ‌డం, నిర్వ‌హ‌ణను బాధ్య‌త‌తో చేప‌డితేనే 10 వేల ఏళ్ల త‌ర్వాత దీని గంట విన‌ప‌డే అవ‌కాశం ఉంటుంది.

Latest News