Site icon vidhaatha

సైనిక ఆయుధాగారంలో భారీ వరుస పేలుళ్లు .. చాడ్‌ రాజధానిలో ఘటన.. 9 మంది మృతి

ఎన్‌ డ్జెమేనా (చాడ్‌) : ఆఫ్రికా దేశం చాడ్‌ రాజధాని నగరం ఎన్‌ డ్జెమేనాలోని సైనిక ఆయుధాగారంలో మంగళవారం రాత్రి భారీ వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 9 మంది చనిపోగా, 46 మంది గాయపడ్డారు. వారికి వివిధ హాస్పిళ్లలో చికిత్స అందిస్తున్నట్టు ప్రభుత్వ ప్రతినిధి అబ్డేర్మాన్‌ కౌలామల్లా చెప్పారు. పేలుళ్ల తీవ్రతతో స్థానిక ప్రజల భయంతో వణికిపోయారని, ఇళ్ల నుంచి పారిపోయారని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు చెప్పారు. పేలుడు జరిగిన సమయంలో ఆకాశంలోకి ఒక్కసారిగా మంటలు వెలువడి.. దట్టమైన పొగ కమ్మేసింది. పేలుళ్లకు కారణమేంటన్నది ఇంత వరకూ తెలియరాలేదు. ఈ విషయంలో దర్యాప్తు నిర్వహిస్తామని దేశాధ్యక్షుడు మహ్మత్‌ డేబీ ఇన్టో చెప్పారు.

ఘటనలో చనిపోయినవారికి నివాళి అర్పిస్తూ, వారి కుటుంబీకులకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన తన ఫేస్‌బుక్‌ పేజీలో ఆకాక్షించారు. అనంతరం ఘటనా స్థలాన్ని ఇన్టో పరిశీలించారు. హాస్పిటళ్లకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఏదో సాయుధ దాడి జరిగిందనే అనుమానంతో భయకంపితులయ్యామని స్థానికుడు ఒమర్‌ మహ్మత్‌ చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుళ్లు మొదలయ్యాయని, వాటి ధాటికి సమీప భవంతులు కంపించిపోయాయని తెలిపారు. ఆయుధ డిపో నుంచి అనేక ఆయుధాలు పేలుతూ దూసుకొచ్చాయని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో సమీప భవంతుల్లో నివాసం ఉండేవారిని అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించారు. కోటీ 80 లక్షల మంది జనాభా ఉన్న చాడ్‌.. వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో డేబి ఇన్టో విజయం తర్వాత రాజకీయ కల్లోలాలు ఎదుర్కొంటున్నది. 2021లో తన తండ్రి మరణం తర్వాత సైనిక పాలన సందర్భంగా కొంతకాలం తాత్కాలిక అధ్యక్షుడిగా డేబి ఇన్టో వ్యవహరించారు.

Exit mobile version