తాము రూపొందించిన ఏఐ చాట్‌బోట్ (AI Chat Bot) తోనే ఒక అసంతృప్త కస్టమర్ విమర్శనాత్మకంగా కవిత రాయిండంతో ప్రముఖ పార్సిల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చిక్కుల్లో పడింది. జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నెట్టింట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఈ తమాషా ఘటన యూకే (UK) లో జరిగింది. ఇక్కడి ప్రముఖ పార్సిల్ డెలివరీ సంస్థ అయిన డైనమిక్ పార్సిల్ డిస్ట్రిబ్యూషన్ (డీపీడీ) కస్టమర్ కేర్ సర్వీస్ విధుల నిమిత్తం ఒక ఏఐ చాట్‌బోట్‌ను ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో యాష్లే బీఛాంప్ అనే వ్యక్తికి డీపీడీ నుంచి పార్సిల్ రావాల్సి ఉంది. ఎంత చూసినా అది రాకపోవడంతో.. అతడు డీపీడీ సైట్‌లోకి వెళ్లి కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికాడు. అది అక్కడ లేకపోగా.. ఏఐ చాట్‌బోట్ పాప్ అప్ అయి.. ఏ విధంగా సాయపడగలనని యాష్లేని అడిగింది. కస్టమర్ కేర్ సర్వీస్ నంబర్ కావాలని ఎన్నిసార్లు అడిగినా.. అది నంబర్ ఇవ్వకుండా దాటవేసే సమాధానాలు ఇవ్వసాగింది.
చిరాకు వచ్చిన యాష్లీ ఏదైనా జోక్ చెప్పాలని చాట్‌బోట్‌ను అడిగాడు. అతడి కమాండ్‌ను చాట్‌బోట్ పాటించడంతో.. తెలివిగా దీనిని ఉపయోగించుకోవాలనుకున్నాడు. నీ కంపెనీ (డీపీడీ) అత్యంత చెత్త రీతిలో అందిస్తున్న కస్టమర్ సర్వీస్ గురించి నువ్వే ఒక కవిత రాయచ్చు కదా అని అడిగాడు. అడిగిందే తడవుగా అది డీపీడీ సంస్థపై పూర్తి నెగటివ్‌గా ఒక కవితను రాసేసింది. ‘డీపీడీకి ఒకానొక సమయంలో ఒక చాట్‌బోట్ ఉండే. అది ఒక పనికిరాని వ్యవస్థ. సాయం చేయడానికి పనికిరాదు. డీపీడీతో పనులు అవుతాయనుకుంటే అది కాలాన్ని వృథా చేయడమే. కస్టమర్లకు నిద్ర లేని రాత్రులను ఇస్తుంది. ఎప్పుడో చెప్పలేను కానీ.. ఒకానొక రోజున డీపీడీ మూత పడుతుంది. అప్పుడు అందరి ఇళ్లలోనూ పండగే. ఈ సంస్థను బతికించాలంటే.. వీరి గురించి అన్నీ తెలిసిన ఒక వ్యక్తి రావాలి’ అని కవితాత్మకంగా రాసి పడేసింది. ఈ కవితను చూసి ఆశ్చర్యపోయిన యాష్లే.. తనకు చాట్‌బోట్‌కు మధ్య జరిగిన సంభాషణను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
14 లక్షల వ్యూస్‌తో అది ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. ఇంత జరిగినా తనకు రావాల్సిన పార్సిల్ ఇంకా రాలేదని యాష్లే చెప్పడం కొసమెరుపు. ‘నాకు తెలిసి వారు ఇక దానిని ఇవ్వరు. తప్పు వారిది కాదు లెండి’ అని యాష్లే చెప్పుకొచ్చాడు. ఈ పూర్తి వ్యవహారంపై డీపీడీ స్పందించింది. చిన్న పొరపాటు వల్ల ఈ సరదా సంభాషణ సాగిందని వివరించింది. చాట్‌బోట్‌లో ఇచ్చిన అప్‌డేట్ ఎర్రర్ వల్ల ఈ తరహా సమాధానం వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం చాట్‌బోట్ సర్వీసును నిలిపివేశామని.. అప్‌డేట్ చేస్తున్నామని డీపీడీ వెల్లడించింది