న్యూయార్క్: విమానం ఆకాశంలో ఉండగా అందులో దుష్ప్రవర్తనకు తెగించిన ఒక అమెరికన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విమానం ఎక్కే ముందు అతడు నాలుగైదు గంజాయి బిళ్లలను తీసుకున్నట్టు తెలుస్తున్నది. విమానం ఎక్కిన దగ్గర నుంచి అతడు ప్రమాదకర, విపరీత చేష్టలకు పాల్పడ్డాడని సిబ్బంది ఫిర్యాదు చేశారు. విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నించడంతోపాటు.. ఒక క్రూ మహిళతో శృంగారానికి కూడా ప్రయత్నించాడని పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
న్యూజెర్సీకి చెందిన ఎరిక్ నికోలస్ గాప్కో అనే 26 ఏళ్ల వ్యక్తి జూలై 18న సియాటిల్ నుంచి డాలస్ వెళ్లే అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్ 2101 ఎక్కాడు. ఎక్కిన దగ్గర నుంచి అతిగా ప్రవర్తించడం మొదలు పెట్టాడని విమాన సంస్థ క్రిమినల్ ఫిర్యాదులో పేర్కొన్నది. తన చొక్కా విప్పేసి, నోటితో ఉమ్మి వేస్తూ.. ఒక ఫ్లైట్ అటెండెంట్‌ను శృంగారం చేద్దామని అడిగాడని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సదరు వ్యక్తి తనను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బందిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం కనిపిస్తున్నది.
సిబ్బంది, ఇతర ప్రయాణికులు అతడిని పట్టుకుని, అతికష్టం చేతులు కట్టేసి, వాష్‌రూమ్‌లో బంధించారు. లోపల నుంచి అరుస్తూ తలుపులు బాదినా తీయలేదు. ఈ ఘటన నేపథ్యంలో విమానాన్ని సాల్ట్‌లేక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. అక్కడ అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టులో కూడా అతడు తన దురుసుతనం మానలేదు. అద్దాలు పగులగొట్టాడు. ఒక అధికారిపై చేయిచేసుకున్నాడు. అతడిని జూలై 31న కోర్టులో హాజరుపర్చారు. దాదాపు పది మారిజునా బిళ్లలను తిని అతడు ఫ్లైట్ ఎక్కాడని న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా తన తోటి ప్రయాణికులకు కూడా వాటిని ఇచ్చేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు.