28న అంత‌రిక్షంలోకి అమెరికాకు చెందిన ర‌హ‌స్య వ‌స్తువు.. ఏదైనా ఆయుధ‌మా?

అమెరికా (America) ఆర్మీకి చెందిన‌ ర‌హ‌స్య అంత‌రిక్ష‌ మాన‌వ‌ర‌హిత విమానాన్ని ((Robotic Space Plane) స్పేస్ ఎక్స్ (Space X) ఈ నెల 28న ప్ర‌యోగించ‌నుంది

  • Publish Date - December 17, 2023 / 11:50 AM IST

అమెరికా (America) ఆర్మీకి చెందిన‌ ర‌హ‌స్య అంత‌రిక్ష‌ మాన‌వ‌ర‌హిత విమానాన్ని ((Robotic Space Plane) స్పేస్ ఎక్స్ (Space X) ఈ నెల 28న ప్ర‌యోగించ‌నుంది. ఈ నెల 17 (ఆదివారం) దీనిని ప్ర‌యోగించాల్సి ఉన్న‌ప్ప‌టికీ వాత‌వ‌ర‌ణ ప్ర‌తికూల‌తల వ‌ల్ల ప్ర‌యోగాన్ని వాయిదా వేశారు. ప్ర‌స్తుతం ఉన్న‌వాటిలో అత్యంత శ‌క్తిమంత‌మైన ఫాల్క‌న్ హెవీ రాకెట్.. ఫ్లోరిడాలోని కేప్‌కార్నివాల్ నుంచి దీనిని అంత‌రిక్షంలోకి తీసుకెళ్ల‌నుంది. ఎక్స్‌-37బి అని పిలిచే ఈ మాన‌వర‌హిత స్పేస్ టెస్ట్ ప్లాట్‌ఫాంను యూఎస్ ఎయిర్‌ఫోర్స్ రూపొందించింది. దీని ప్ర‌యోగ ఉద్దేశాలు మాత్రం ఇప్పటికీ ఒక ర‌హ‌స్యమే. చిన్న సైజు బ‌స్సు ప‌రిమాణంలో ఉండే ఇందులో.. ప్ర‌యోగాలు చేయ‌డానికి అనేక ప‌రిక‌రాల‌ను పంపుతున్న‌ట్లు తెలుస్తోంది.


మిల‌ట‌రీ ఆప‌రేష‌న్లు నిర్వ‌హించ‌డానికి కావాల్సిన స‌మాచార సేక‌ర‌ణ‌కే దీని ప్ర‌యోగ‌మ‌ని కొంద‌రు నిపుణులు చెబుతున్నారు. భ‌విష్య‌త్ విమానాల రూప‌క‌ల్ప‌న‌కు, స్పేస్ ప్ర‌యోగాల‌కు కావాల్సిన స‌మాచార సేక‌ర‌ణ‌కు దీనిని పంపుతున్నామ‌ని ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్ల‌డిస్తున్నారు. సౌర శ‌క్తితో ప‌నిచేసే ఈ రోబోటిక్ విమానాన్ని భూమిపై 177 నుంచి 805 కి.మీ. ఎత్తులో ఉంచుతారు. అక్క‌డ ప్ర‌యోగాలు పూర్త‌యి అనంత‌రం ఎక్స్‌-37బి (X-37B) భూమిపై తిరిగి రానుంది. దీనిని పున‌ర్వినియోగించుకునేలానే రూపొందించ‌డంతో.. భ‌విష్య‌త్తులోనూ ఇది ప్ర‌యాణాలు కొన‌సాగిస్తుంది. 2010లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించ‌గా నాసా కూడా వీరితో చేయి క‌లిపింది. వీటిలో కొన్ని విత్త‌నాల పంపుతున్న శాస్త్రవేత్త‌లు.. అంత‌రిక్షంలో రేడియేష‌న్ వ‌ల్ల వీటిలో వ‌చ్చే మార్పుల‌ను అధ్య‌య‌నం చేయ‌నున్నారు. ఈ మాన‌వ‌ర‌హిత విమానం ఎన్నిరోజుల పాటు అంత‌రిక్షంలో ఉంటుంద‌న్న‌ది అధికారికంగా చెప్ప‌న‌ప్ప‌టికీ.. 2026 జూన్ త‌ర్వాతే ఇది భూమిపైకి రానుంద‌ని తెలుస్తోంది. 29 అడుగుల పొడ‌వు, 9.5 అడుగుల ఎత్తు ఉండే ఈ విమానానికి 15 అడుగుల రెక్క‌లు ఉంటాయి. ఎక్స్-37 మిష‌న్ 1999లో మొద‌ల‌వ‌గా ఇందులో భాగంగా ఇప్ప‌టికే అయిదు మిష‌న్లు పూర్త‌య్యాయి. ఎక్స్‌-37బి ఈ వ‌రుస‌లో ఆర‌వ‌ది.

ర‌హ‌స్య ఆయుధ‌మా?

ఎక్స్‌-37బి గురించి అమెరికా గోప్య‌త పాటిస్తుండ‌టంతో దీనిపై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఇది ఇతర దేశాల‌ను నాశ‌నం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని.. అందుకే నాసా కాకుండా ఎయిర్‌ఫోర్స్ దీనిని ప్ర‌యోగిస్తోంద‌ని చాలా మంది వ్యాఖ్యానించారు. అయితే ఎక్స్‌37-బి ప‌రిమాణం చాలా చిన్న‌ద‌ని.. ఒక దేశాన్ని నాశ‌నం చేసే సామ‌ర్థ్యం దీనికి ఉండ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక‌తో రూపొందించిన సెన్స‌ర్ల‌ను, కొత్త త‌రం శాటిలైట్ టెక్నాల‌జీల ప‌నితీరును మ‌దింపు చేయ‌డానికే ఈ ప్ర‌యోగం చేస్తున్న‌ట్లు భావించాల‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు.

Latest News