అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

అమెరికాలోని లాస్‌వేగాస్‌లో చోటు చేసుకున్న కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.

  • Publish Date - December 7, 2023 / 10:06 AM IST

వాషింటన్‌ : అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగటం లేదు. సాధారణ ప్రజలు చనిపోవడం నిలవడం లేదు. నిత్యం ఏదో ఒకచోట కాల్పుల మోతలు వినపడుతూనే ఉన్నాయి. అలా మరొకసారి అమెరికాలో వరస కాల్పులతో అట్టుడికి పోయింది. అమెరికాలో గన్ కల్చర్ విశృంఖల రూపానికి మరో ఉదాహరణగా నిలిచిపోయింది. సాధారణ పౌరుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ పెన్సిలో, పెన్నో కొన్నంత ఈజీగా గన్నును కూడా కొనుక్కుంటారు. అంతేకాదు తమ ఇష్టం వచ్చిన వెపన్‌ కొనుక్కోవచ్చు. దీనితో దాదాపు అందరి దగ్గర ఏదో ఒక గన్‌ ఉండే అవకాశం ఉంది. అయితే ఇక ఏ చిన్న వివాదం తలెత్తినా, చీమ చిటుక్కుమన్నా గోలీమార్ అనే అంటారు. అమెరికా కాల్పుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం వున్నాయి.

అలాంటి ఘటనే మరొకసారి వెలుగు చూసింది. అమెరికాలోని లాస్ వేగాస్ యూనివర్సిలో ఓ దుండగుడు దురంహకారంతో జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారని, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించామని చెప్పారు. చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలియజేశారు. లాస్ వేగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఈ కాల్పులు జరిపిన అనుమానితుడు కూడా మరణించి నట్లు ప్రకటించారు. అలానే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలా కాల్పులు జరగడం అమెరికాలో ఇది కొత్తేమీ కాదు. ఈ సంవత్సరం తొలి నుంచి ఇటువంటి కాల్పుల ఘటనలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. ఇది దేశ ప్రజలనే కాక ప్రపంచ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తునాయి. మరో వైపు ప్రభుత్వం ఈ ఘటనల పట్ల కింకర్తవ్యం వైఖరి తో కేవలం కేసుల నమోదుకే పరిమితం అవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


పాల‌స్తీనా-ఇజ్రాయెల్ సంక్షోభం ఈ కాల్పుల‌కు కార‌ణ‌మా?

ఈ ఘ‌ట‌న కార‌ణంగా యూనివ‌ర్సిటీ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌న సంచారంపై పోలీసులు మార్గ‌ద‌ర్శకాలు జారీ చేశారు. కాల్పుల‌కు గ‌ల కార‌ణం ఏమిటో చెప్పేవ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని… యూనివ‌ర్సిటీ వైపు రాకపోక‌లు త‌గ్గించాల‌ని సూచించారు. దుండ‌గుడు చ‌నిపోవ‌డంతో ద‌ర్యాప్తు నిలిచిపోయింద‌ని కార‌ణం తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు లాస్ వేగ‌స్ మెట్రోపాలిట‌న్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్ల‌డించింది.


ఘ‌ట‌న జ‌రిగిన విధానాన్ని అప్పుడు అక్క‌డే ఉన్న ప్రొఫెస‌ర్ విన్సెంట్ పెరెజ్ వివ‌రించారు. ఒక్క‌సారిగా పెద్ద పెద్ద కాల్పుల శ‌బ్దాలు వినిపించాయి. వెంట వెంట‌నే ప‌లు రౌండ్లు కాల్పులు జ‌రిగాయి. వెంట‌నే మేము త‌ర‌గ‌తుల్లోకి వెళ్లిపోయి దాక్కున్నాం అని పేర్కొన్నారు. కాల్పులు యూనివ‌ర్సిటీలోని బిజినెస్ స్కూల్ ఉండే బీం హాల్‌లో జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. మ‌రికొంత మంది విద్యార్థుల యూనియ‌న్ స‌మావేశంలో కాల్పులు జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. ఈ యూనివ‌ర్సిటీలో మొత్తం 33 వేల మంది చ‌దువుతుండ‌గా.. పాల‌స్తీనా-ఇజ్రాయెల్ సంక్షోభం ఈ కాల్పుల‌కు కార‌ణ‌మా అనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Latest News