Khaleda Zia | ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా( Khaleda Zia )(80) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 6 గంటలకు కన్నుమూశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ( BNP ) నాయకురాలైన జియా.. 1991- 96, 2001 – 2006 మధ్య పదేండ్ల పాటు బంగ్లాదేశ్ ప్రధానిగా సేవలందించారు. జియా మృతిపట్ల ఆ దేశ రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటీవల ఆమె కుమారుడు తారిక్ రహమాన్ 17 ఏండ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టారు.
గత కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో జియా బాధపడుతున్నారు. నవంబర్ 23న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. 36 రోజుల పాటు చికిత్స అనంతరం మంగళవారం ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. న్యూమోనియాతో కూడా ఆమె బాధపడుతున్నట్లు బంగ్లాదేశీ డెయిలీ ది డెయిలీ స్టార్ వెల్లడించింది. ఖలీదా జియా మృతిని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆమె మృతికి శాంతి చేకూరాలని ప్రార్థించినట్టు సంతాప ప్రకటనలో పార్టీ పేర్కొంది.
బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఖలీదా జియా.. కాలేయం, మధుమేహం, కీళ్ల నొప్పులు, కళ్లకు సంబంధిచిన సమస్యలతో పాటు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత రోగాలతో చాలా కాలం నుంచి పోరాడుతున్నారు. ఇటీవల ఆస్పత్రిలో చేరగా.. ఆమెకు బంగ్లాదేశ్, యూకే, యూఎస్ఏ, చైనా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వైద్య నిపుణుల పర్యవేక్షణలో వైద్యం కొనసాగింది. ఈ నెల మొదట్లో జియాను చికిత్స నిమిత్తం విదేశాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.
