ICC Replaces Bangladesh With Scotland | బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్‌

బంగ్లాదేశ్‌కు ఐసీసీ ఊహించని షాక్! టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లా అవుట్.. ఆ స్థానంలో స్కాట్లాండ్‌కు ఛాన్స్. రూ. 240 కోట్ల నష్టంపై ఆందోళనలో బీసీబీ..

ICC Replaces Bangladesh With Scotland

విధాత : భారత్ లో నిర్వహిస్తున్న టీ 20 వరల్డ్ కప్ లో ఆడబోమన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది. గ్రూప్‌-Cలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ క్రికెట్ టీమ్ కు ఐసీసీ అనుమతినిచ్చింది. తమ హెచ్చరికలను బేఖాతారు చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ తాజా నిర్ణయంతో గట్టి షాక్ ఇచ్చినట్లయ్యింది.

అంతకుముందు భారత్‌లోనే తమ మ్యాచ్‌లను నిర్వహించాలన్న ఐసీసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బీసీబీ దాఖలు చేసిన అప్పీల్‌ను ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (డీఆర్‌సీ) తిరస్కరించింది. తమ పరిధిలోకి రాని అంశంపై దర్యాప్తు చేయలేమని డీఆర్‌సీ కమిటీ తేల్చి చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నియమావళి, డీఆర్‌సీ నిబంధనల ప్రకారం ఐసీసీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ తీసుకున్న నిర్ణయాలపై అప్పీల్‌ను విచారణ చేసే అధికారం కమిటీకి లేదని వెల్లడించారు.డీఆర్‌సీ నిర్ణయం నేపథ్యంలో చివరి అస్త్రంగా స్విట్జర్లాండ్‌లోని కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్‌)ను ఆశ్రయించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రయత్నించింది. ఇంతలోనే టీ 20 ప్రపంచకప్ లో స్కాంట్లాండ్ కు స్థానం కల్పిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న హత్యాకాండపై భారత్ లో తీవ్ర నిరసనలు వ్యక్తమైన నేపధ్యంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్ నుంచి బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను తప్పించారు. ఈ నిర్ణయంపై భగ్గుమన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్ లో జరిగే టీ 20 వరల్డ్ కప్ లో తాము ఆడబోమంటూ ప్రకటించింది. తమ మ్యాచ్ లను మరో దేశంలో నిర్వహించాలని కోరింది. అందుకు ఐసీసీ నిరాకరించి బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ ను రంగంలోకి దించడం విశేషం. టీ20 ప్రపంచకప్ కు బంగ్లాదేశ్ దూరమవ్వడంతో ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టంతోపాటు ఆటగాళ్ల పరిస్థితి కూడా అయోమయంలో పడింది. ప్రపంచ వేదికపై తమ సత్తా చాటాలని ఆరాటపడే యువ క్రికెటర్ల భవిష్యత్తును, బంగ్లాదేశ్ క్రికెట్ నాణ్యతను కొన్ని దశాబ్దాల వెనక్కి నెట్టివేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశ క్రికెట్ బోర్డుకు రూ. 240 కోట్ల మేరకు నష్టం వాటిల్లనుంది. దీంతో ఆ దేశంలో క్రికెట్ అభివృద్ది, మౌలిక వసతుల కల్పన కుంటుపడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఐసీసీ నుంచి ఆంక్షలు లేదా భవిష్యత్తు టోర్నీలపై నిషేధం పడే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు.

ఇవి కూడా చదవండి :

IAS Weds IPS : ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం
Jaydeep Gohil Underwater Stunts | నీటి అడుగున విన్యాసాల సాహసం..వీడియో వైరల్

Latest News