Khaleda Zia | ఢాకా : బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి, ఆ దేశ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా(80) కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జియా మృతితో బంగ్లాదేశ్ వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పార్టీ అధినేత్రి మృతి పట్ల పార్టీ సంతాపం ప్రకటించింది.
ఎవరీ ఖలీదా జియా..?
1946లో అప్పటి అవిభక్త దినాజ్‌పూర్ జిల్లాలోని జల్‌పైగురిలో ఖలీదా జియా జన్మించారు. 1991- 96, 2001 – 2006 మధ్య పదేండ్ల పాటు బంగ్లాదేశ్ ప్రధానిగా సేవలందించారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. జియా బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్‌ను వివాహం చేసుకుంది. రెహమాన్ 1981లో హత్యకు గురయ్యారు.
రెహమాన్ హత్య అనంతరం ఖలీదా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో చేరి ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తొలుత సభ్యురాలిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జియా.. పార్టీ అధ్యక్షురాలిగా ఎదిగారు. 1983లో పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కాగా, ఆ మరుసటి రోజే పార్టీ అధినేత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్ ఆర్మీ జనరల్ హుస్సేన్ మహమ్మద్ ఈర్షద్ పాలనకు ముగింపు పలకడానికి 1983లో ఏడు పార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడంలో జియా ప్రధానపాత్ర పోషించారు.
