Pope election | పోప్ ఫ్రాన్సిస్ మరణం నేపథ్యంలో కొత్త పోప్‌ను ఎన్నుకోనున్నారు. ఈ పవిత్రకార్యం కోసం త్వరలో కాంక్లేవ్‌ను సమావేశపర్చనున్నారు. ఈ కాంక్లేవ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినల్స్.. వాటికన్‌కు చేరుకుంటారు. అందులో భారత్ నుంచి కొందరు హాజరుకానున్నారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన కార్డినల్ సైతం ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 252 మంది కార్డినల్స్ ఉన్నారు. వారిలో 135 మందికే ఓటు వేసే హక్కు ఉన్నది. 80 ఏళ్ల పైబడిన కార్డినల్స్‌కు ఓటు హక్కు ఉండదు. కొత్త పోప్‌ను ఎన్నుకునే కార్డినల్స్‌లో ఎక్కువ మంది ఇటలీ (51) నుంచి ఉన్నారు.
భారతదేశంలో ఆరుగురు కార్డినల్స్ ఉన్నారు. కేరళ నుంచి కార్డినల్ జార్జ్ అలంచెరి (80), మహారాష్ట్ర నుంచి కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియాస్ (80), గోవా నుంచి కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రావ్ (72), కేరళ నుంచి కార్డినల్ క్లీమిస్ బసేలియోస్ (64), ఆంధ్రప్రదేశ్ నుండి కార్డినల్ ఆంథోనీ పూల (63) (ఈయన పుట్టినది ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మెట్రోపాలిటన్ ఆర్క్‌బిషప్ ఆఫ్ హైదరాబాద్‌గా ఉన్నారు.), కేరళ నుండి కార్డినల్ జార్జ్ జాకబ్ కూవకాడ్ (51). అయితే.. వీరిలో నిబంధన మేరకు నలుగురికి మాత్రమే తదుపరి పోప్ ఎన్నికలో ఓటు హక్కు ఉన్నది. కార్డినల్ గ్రేసియాస్ గతేడాది క్రిస్మస్ రోజున 80 వ పుట్టిన రోజు జరుపుకొన్నారు. కాగా.. కార్డినల్ అలంచెరి రెండు రోజుల క్రితమే.. 2025, ఏప్రిల్ 19న ఆ మైలురాయి దాటారు. కనుక వీరిద్దరికీ రాబోయే ఎన్నికలో ఓటు వేసే అవకాశం లేదు.
ఇదీ ఇడియాలోని కార్డినల్స్ పరిచయం..
కార్డినల్ బసెలియోస్
కార్డినల్ బసెలియోస్ సిరో-మలంకర క్యాథలిక్ చర్చ్‌కు మొదటి కార్డినల్ కావడం ద్వారా చరిత్ర సృష్టించారు. 95 సంవత్సరాల క్రితతం స్థాపితమైన ఈ సంఘం.. క్యాథలిక్ చర్చ్‌కు చిన్న శాఖగా మారింది. 1959 జూన్ 15న కేరళలోని పతనంతిట్ట జిల్లా తిరువల్లలో జన్మించారు. 2012లో పోప్ బెనెడిక్ట్ XVI ద్వారా కార్డినల్‌గా నియమితులయ్యారు. 53 సంవత్సరాల వయస్సులో ఆ బిరుదు పొందిన అతి పిన్న వయస్కుడిగా ప్రత్యేకత పొందారు.
కార్డినల్ ఫిలిప్ నేరి ఫెర్రావ్
కార్డినల్ ఫెర్రావ్‌ను ఆ హోదాలో 2022లో పోప్ ఫ్రాన్సిస్ నియమించారు. 1953 జనవరి 20న గోవాలోని మపుసాలో జన్మించిన ఆయన.. 2004 నుండి గోవా, డామన్ రోమన్ కాథలిక్ ఆర్చ్ డియోసెస్ ఆర్చ్ బిషప్‌గా సేవలందిస్తున్నారు. కార్డినల్‌గా నియమితులైన ఆరవ గోవా వాసి. ఈ సంవత్సరం ప్రారంభంలో కార్డినల్ ఫెర్రావ్ ఆసియా బిషప్స్ కాన్ఫరెన్స్‌ల సమాఖ్య (FABC) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
కార్డినల్ జార్జ్ జాకబ్ కూవకాడ్
భారతదేశంలో తాజాగా కార్డినల్‌గా నియమితులయ్యారు కార్డినల్ ఫెర్రావ్. డిసెంబర్ 2024 లో పోప్ ఫ్రాన్సిస్ ఆయనను కార్డినల్‌గా నియమించారు. ఆయన వయసు 51 సంవత్సరాలు. అతి పిన్న వయస్కుడైన కార్డినల్స్‌లో ఆయన ఒకరు. 1973 ఆగస్టు 11 న కేరళలోని చెతిపుళలో జన్మించారు. సిరో-మలబార్ క్యాథలిక్ చర్చ్ సభ్యుడు. కార్డినల్ కూవకాడ్ డికాస్టరీ ఫర్ ఇంటర్‌రిలిజియస్ డైలాగ్ ప్రస్తుత ప్రిఫెక్ట్ కూడా. మతాంతర సంభాషణను ప్రోత్సహించడానికి 1964 లో పోప్ పాల్ XVI దీనిని స్థాపించారు.
కార్డినల్ ఆంథోనీ పూల
ఆగస్టు 2022లో, కార్డినల్ ఫెర్రావ్‌తో కలిసి, కార్డినల్ పూల పోప్ ఫ్రాన్సిస్ ఆశీర్వాదంతో కార్డినల్స్ కాలేజీలో చేరారు. 1961 నవంబర్ 15న ఆంధ్రప్రదేశ్‌లోని పోలూరులో జన్మించారు. చిన్నతనంలో చదువుకునేందుకు పేదరికం అడ్డురావడంతో మిషనరీలు ఆయనకు మద్దతు ఇచ్చాయి. కార్డినల్‌గా నియమితులైన మొదటి దళితుడిగా కూడా కార్డినల్ పూల చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్‌గా పనిచేస్తున్నారు.
ఇదికూడా చదవండి..
Pope election | కొత్త పోప్ ఎంపికలో నల్ల పొగ, తెల్ల పొగలే కీలకం! అవి ఎలా తెప్పిస్తారంటే..