Pope election | పోప్ ఫ్రాన్సిస్ మరణం నేపథ్యంలో క్యాథలిక్కులకు కొత్త పోప్‌ను ఎంపిక చేసుకోవాల్సిన అనివార్యత ఎదరైంది. ఇక వాటికన్ సిటీలో కొత్త పోప్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నారు. దీంతో కొత్త పోప్ ఎవరు అవుతారన్న అంశంలో ఆసక్తి నెలకొన్నది. అదే సమయంలో పోప్ ఎంపికకు అనుసరించే ప్రత్యేక పద్ధతి గురించి కూడా చర్చించుకుంటున్నారు. ఒక సంప్రదాయ పద్ధతి ప్రకారం పోప్‌ను ఎంపిక చేస్తారు. రోమన్ క్యాథలిక్ చర్చ్‌కి కొత్త పోప్ ఎంపికపై అంగీకారం కుదిరిందా లేదా అన్న విషయం ఒక పొగ గొట్టం నుంచి వెలువడే పొగ ఆధారంగా గుర్తించారు.
ఈ సంప్రదాయం ఎలా మొదలైంది? తెల్లని పొగ లేదా నల్లని పొగ వచ్చేందుకు ఉపయోగించే రసాయనిక ప్రక్రియ ఏమిటి? ఈ కథనంలో చూద్దాం.
ఫుమాటా! కొత్త పోప్‌ను ఎంపికను ప్రకటించే సంప్రదాయం. వందల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ఈ సంప్రదాయంలో రోమన్ క్యాథలిక్ చర్చ్ కార్డనల్ కాంక్లేవ్ కొత్త పోప్‌పై ఒక ఏకీభావానికి వచ్చినట్టు పొగ గొట్టం నుంచి పొగ వదలడం ద్వారా ప్రకటిస్తుంటుంది. కొత్త పోప్‌ను కాంక్లేవ్.. రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటుంది. అయితే.. గోప్యతను కాపాడేందుకు ప్రతి బ్యాలెట్‌నూ కాల్చివేస్తారు. ఫుమటా నెరా లేదా నల్లని పొగ.. పొగగొట్టం నుంచి వచ్చిందంటే.. ఓటింగ్ అసంపూర్ణంగా ముగిసిందని అర్థం. తెల్లని పొగ లేదా ఫుమటా బియాంకా అంటే.. పోప్‌ను విజయవంతంగా ఎనుకున్నామన్న ప్రకటనకు సంకేతం. ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైందనేది కచ్చితంగా తెలియదు. మధ్యయుగాల చివరిలో లేదా ఆధునిక యుగం మొదట్లో ఈ సంప్రదాయం ప్రవేశించినట్టు భావిస్తున్నారు. 19వ శతాబ్దంలో ఆ పద్ధతిని లాంఛనం చేశారని రోమన్ చర్చ్ చరిత్రకారులు చెబుతున్నారు.
పోప్‌ను ఎన్నుకునే కాంక్లేవ్ అనే పదం.. లాటిన్ నుంచి వచ్చింది. ‘ఒక తాళంతో’ అని పదానికి అర్థం. ఇది కార్డినల్స్ రహస్యంగా జరిపే భేటీ. కాంక్లేవ్‌ను 1274లో పోప్ గ్రెగరీ X.. తొలిసారి ఏర్పాటు చేశారు. అంతకు ముందు కాంక్లేవ్‌లు కొత్త పోప్ ఎన్నిక సమాచారాన్ని ప్రజలతో పంచుకొనేవారు కాదు. కొత్త పోప్ ఎంపిక జరిగే సమయంలో ఔత్సాహికులు సిస్టైన్ చాపల్ బయట గుమిగూడి దానినుంచి వచ్చే పొగ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ నల్ల, తెల్లని పొగలు లోపల కార్డినల్స్ కాంక్లేవ్‌లో జరుగుతున్న ఎంపిక ప్రక్రియను కమ్యూనికేట్ చేస్తుంటాయి.
పొగ నల్లగా లేదా తెల్లగా రావడానికి కూడా ఒక ప్రక్రియను ఉపయోగిస్తారు. పాత రోజుల్లో బ్యాలెట్లను పొడి ఎండుగడ్డితో కాల్చడం ద్వారా తెల్లని పొగ వచ్చేలా చేసేవారు. నల్లని పొగ రావడానికి గడ్డిపరకలను తడిపి.. కాల్చేవారు. 20వ శతాబ్దంలో కెమికల్ ప్రాసెస్‌ను ప్రవేశపెట్టారు. తెల్లని లేదా నల్లని పొగ స్పష్టంగా కనిపించేందుకు వీలుగా వేరే పదార్థాలు జోడించడాన్ని 1963లో ప్రవేశపెట్టారు. ప్రస్తుత రోజుల్లో బ్యాలెట్లను తొలుత స్టవ్‌పై కాల్చి.. నిర్దిష్ట రసాయనాలు వాడటం ద్వారా కావాల్సిన రంగులలో పొగ వచ్చేలా చేస్తున్నారు. నల్లని పొగ తెప్పించేందుకు పొటాషియం పెర్క్లోరేట్, ఆంత్రాసిన్ కలుపుతారు. తెల్లని పొగ తెప్పించేందుకు పొటాషియం క్లోరేట్, లాక్టోజ్, రోసిన్ రసాయనాలు వాడుతారు. అస్పష్టతను నివారించేందుకు 2005 నుంచి ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ రెండో స్టవ్‌ను ప్రవేశపెట్టారు.
ఇదికూడా చదవండి