విధాత: పోప్ ఫ్రాన్సిస్ (88) (Pope Francis) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. సోమవారం ఆయన వాటికన్ సిటీలో తుది శ్వాస విడిచారు. పోప్ ఫ్రాన్సిస్ గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్దిరోజుల క్రితమే పోప్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ తన ఆఖరి సందేశం ఇచ్చారు. స్వేచ్ఛ, సహనాలపై పిలుపునిచ్చారు. “మత స్వేచ్ఛ, ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇతరుల అభిప్రాయాలను గౌరవించకుండా శాంతి ఉండదు,” అని ఆయన తన ప్రసంగం ద్వారా పేర్కొన్నారు. ఆందోళనకరమైన యూదు వ్యతిరేకతను, గాజాలో విచారకరమైన పరిస్థితిని ఆయన తన ప్రసంగం ద్వారా ఖండించారు. కాగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత పర్యటనకు ముందు పోప్ ఫ్రాన్సిస్ ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆశీస్సులు తీసుకున్న మరునాడే పోప్ మరణించడం ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
పోప్ ఫ్రాన్సిస్ 1936 డిసెంబర్ 17న అర్జెంటినాలో జన్మించారు. 2013 మార్చి 13న 266వ పోపుగా ఎన్నికయ్యారు. దక్షిణ అమెరికా నుంచి పోప్ గా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఫ్రాన్సిస్ ఖ్యాతి గడించారు. పోప్ గా ఎన్నికైన నాటి నుంచి ఆయన సెలవు తీసుకోకపోవడం విశేషం. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో, ఆయన జెస్యూట్ పూజారిగా, అర్జెంటీనాలో కార్డినల్‌గా సేవలందించారు. పోప్‌గా, ఆయన వినయం, సామాజిక న్యాయం, పర్యావరణ సంరక్షణ, అంతర్ధార్మిక సంభాషణలపై దృష్టి సారించారు. పోప్ ఫ్రాన్సిస్ రష్యా -ఉక్రెయిన్ యుద్దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రెండు దేశాలు శాంతిని పాటించాలని పలుమార్లు సందేశాన్ని ఇచ్చారు. గాజాలో కూడా శాంతి నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు.