China Birth Rate : చైనాలో జనాభా సంక్షోభం.. భారీగా తగ్గిన జననాల రేటు.. 1949 తర్వాత ఇదే తొలిసారి

చైనాలో జనాభా సంక్షోభం! 1949 తర్వాత తొలిసారిగా జననాల రేటు భారీగా తగ్గింది. వృద్ధుల సంఖ్య పెరిగి, యువత తగ్గడంతో డ్రాగన్ దేశం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

China Birth Rate

జనాభా సంక్షోభంతో డ్రాగన్‌ దేశం చైనా (Chinas birth rate) కొట్టుమిట్టాడుతోంది. జనాభా క్షీణత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. జననాల రేటు పెంచేందుకు జిన్‌పింగ్‌ సర్కార్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ఫలితంగా వరుసగా నాలుగో ఏడాది కూడా చైనా జనాభా తగ్గింది. 2024 ఏడాదితో పోలిస్తే 33.9 లక్షలు తగ్గి.. 2025 చివరి నాటికి జనాభా రేటు 140.4 కోట్లకు చేరింది. 1949 తర్వాత దేశంలో జననాల రేటు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

జాతీయ గణాంకాల మండలి (ఎన్‌బీఎస్‌) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనాలో 2025లో జన్మించిన నవజాత శిశువుల సంఖ్య 16 లక్షలు తగ్గి, 79 లక్షలకు చేరింది. 2000వ సంవత్సరం తర్వాత ఇంత తక్కువ జననాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. 2024లో ఇది 95.4 లక్షలుగా ఉంది. ఇక గత ఏడాది 1.13 కోట్లమంది చనిపోయారు. అయిదు దశాబ్దాల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో, మరణాల రేటు ప్రతి 1000 మందికి 8.04కి పెరిగింది. ఇది 1968 తర్వాత అత్యధికం. పనిచేసే సామర్థ్యం గల ఉద్యోగ బృందం తగ్గుతుండటం, వృద్ధ జనాభా పెరుగుతుండటం చైనాకు ప్రధాన ముప్పుగా మారిందని నిపుణుల భావన.

తగ్గుతున్న యువ జనాభా..

బీజింగ్‌ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. చైనాలో వృద్ధుల జనాభా పెరుగుతుండగా.. పని చేసే యువ జనాభా సంఖ్య తగ్గుతూ వస్తున్నది. మరో వైపు జనన రేటు మాత్రం పెరుగడం లేదు. చైనా జనాభా తగ్గేందుకు పలు కారణాలు సైతం ఉన్నాయి. యువత తమ భవిష్యత్తు, ఉద్యోగ భద్రత, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో వివాహం చేసుకోవడం లేదు. కొందరు వివాహం చేసుకున్నా పిల్లల్ని కనడం లేదు. మరికొందరు లేటు వయసులో పెళ్లి చేసుకోవడంతో సంతానం కలుగకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

కొంప ముంచిన ఒకే బిడ్డ విధానం

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో చైనా ఒకటి. 1949లో కమ్యూనిస్ట్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక.. మూడు దశాబ్దాల్లోనే దేశ జనాభా రెట్టింపు అయ్యింది. దాంతో దేశ జనాభా పెరుగుదల నేపథ్యంలో ఆహార భద్రతా సంక్షోభానికి దారి తీసింది. దాంతో జనాభా నియంత్రణకు ఒకే బిడ్డ విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. మహిళలు బిడ్డను కనాలంటే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆదేశాలు ఉల్లంఘిస్తే బలవంతంగా గర్భస్రావం చేయడంతో పాటు జరిమానా విధించారు.

అదే సమయంలో రెండో బిడ్డకు గుర్తింపును ఇచ్చేందుకు సైతం ప్రభుత్వం నిరాకరించింది. చైనాలో లింగ లింగ నిష్పత్తిలో తేడాలున్నాయి. ఆ దేశంలో 104 మంది పురుషులకు కేవలం 100 మంది స్త్రీలు మాత్రమే ఉన్నట్లు చైనా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో చైనాలో సీనియర్‌ సిటిజన్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దేశ జనాభాలో దాదాపు ఐదోవంతు మంది 60, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారే ఉన్నారు. వీరి సంఖ్య మొత్తం జనాభాలో 22శాతంగా ఉన్నది. 2035 నాటికి ఈ సంఖ్య 30 శాతానికి చేరుకుంటుందని అంచనా.

ప్రోత్సాహకాలు ప్రకటించినా..

జనాభా తగ్గుతుండటంతో చైనా ప్రభుత్వం ఆందోళనకు గురవుతున్నది. చాలా మంది పెండ్లిళ్లు చేసుకోవడం లేదని, పిల్లలను కనేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని, పెరుగుతున్న ఆర్థిక భారమే ఇందుకు కారణమని చైనా సర్కారు గుర్తించింది. ఈ క్రమంలో జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నది. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం జనాభాను పెంచేందుకు గతంలో విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేసింది. ముగ్గురు పిల్లల విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది.

ప్రోత్సాహకాల్లో భాగంగా కండోమ్స్‌ సహా గర్భనిరోధక సాధనాలు, పలు వస్తువులపై 13 శాతం పన్నును విధిస్తూ విలువ ఆధారిత పన్ను (VAT) చట్టాన్ని ఇప్పటికే సవరించింది. పిల్లల సంరక్షణ సేవలు (నర్సరీ నుంచి కిండర్‌గార్టెన్స్‌ వరకు), వృద్ధుల సంరక్షణ, వికలాంగుల సేవలు, వివాహ సంబంధిత సేవలపై పన్ను మినహాయింపును జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అనేక ప్రావిన్సుల్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు కనేవారికి ప్రోత్సాహకాలను అమలు చేసింది. ప్రోత్సాహకాలతో జనాభా పెరుగుతుందని ఆశించినా ఏమాత్రం ఊరటనివ్వలేకపోయాయి.

ఇవి కూడా చదవండి :

Allari Naresh | అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖుల నివాళులు

silver all time high| దూసుకపోతున్న వెండి ధర..ఒక్క రోజునే రూ. 12వేల పెంపు

Latest News