Allari Naresh | అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం.. ప్ర‌ముఖుల నివాళులు

Allari Naresh | టాలీవుడ్ యువ నటుడు అల్లరి నరేష్ కుటుంబాన్ని విషాదం కమ్మేసింది. ఆయన తాత, ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారి తండ్రి అయిన ఈదర వెంకట్రావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, మంగ‌ళ‌వారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Allari Naresh | టాలీవుడ్ యువ నటుడు అల్లరి నరేష్ కుటుంబాన్ని విషాదం కమ్మేసింది. ఆయన తాత, ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారి తండ్రి అయిన ఈదర వెంకట్రావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, మంగ‌ళ‌వారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో ఈదర కుటుంబంలో తీవ్ర దుఃఖ వాతావరణం నెలకొంది. నిడదవోలు పరిసర ప్రాంతాల్లో ఎంతో గౌరవం పొందిన వ్యక్తిగా పేరుగాంచిన ఈదర వెంకట్రావు, సాధారణ జీవితం గడుపుతూ కుటుంబాన్ని విలువలతో పెంచిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన వయసు 90 సంవత్సరాలు కాగా, ఆరోగ్యం క్షీణించడంతో కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆయన ప్రాణాలు విడిచారని సమాచారం.

ఈదర వెంకట్రావు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి, తన పిల్లలను ఉన్నత స్థానాలకు చేర్చిన వ్యక్తిగా స్థానికంగా గుర్తింపు పొందారు.ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ఈవీవీ సత్యనారాయణ – తెలుగు చిత్రసీమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దిగ్గజ దర్శకుడు.రెండో కుమారుడు గిరి స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. మూడో కుమారుడు ఈవీవీ శ్రీనివాస్. కుమార్తె ముళ్లపూడి మంగాయమ్మ. ఈవీవీ సత్యనారాయణ గారి వారసత్వాన్ని ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ కొనసాగిస్తూ టాలీవుడ్‌లో తమదైన గుర్తింపును సంపాదించారు.

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఈదర వెంకట్రావు అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జ‌ర‌గ‌నున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో నిర్వహించనున్నారు. ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అల్లరి నరేష్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. సినీ రంగానికి పరోక్షంగా ఒక బలమైన పునాది వేసిన వ్యక్తిగా ఈదర వెంకట్రావును పలువురు గుర్తు చేసుకుంటున్నారు. తండ్రి, తాతగా మాత్రమే కాకుండా కుటుంబాన్ని ఒక్కతాటిపై నడిపించిన పెద్దమనిషిగా ఆయన జ్ఞాపకాలు ఈదర కుటుంబానికి ఎప్పటికీ అమూల్యంగా నిలిచిపోతాయి.

Latest News