మొద‌టి ఏక క‌ణ జీవి ఉద్భ‌వించింది వేడి నీటి బుగ్గ‌ల్లోనే.. శాస్త్రవేత్త‌ల అంచ‌నా!

భూమిపై జీవం (Life on Earth) నీటి నుంచే తొలుత ఆవిర్భ‌వించింద‌ని శాస్త్రవేత్త‌లు ఇదివ‌ర‌కే క‌నుగొన్నారు

  • Publish Date - January 16, 2024 / 08:53 AM IST

భూమిపై జీవం (Life on Earth) నీటి నుంచే తొలుత ఆవిర్భ‌వించింద‌ని శాస్త్రవేత్త‌లు ఇదివ‌ర‌కే క‌నుగొన్నారు. అందులోనూ స‌ముద్రంలోనే తొలి జీవి ఉద్భ‌వించి ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే తాజాగా జ‌రిపిన ఒక ప‌రిశోధ‌న‌ (Study) లో వేడి నీటి బుగ్గ‌ (Hot Springs) ల నుంచి తొలి ఏక క‌ణ జీవి పుట్టి ఉండొచ్చ‌ని చెబుతున్నారు. న్యూకాసిల్ యూనివ‌ర్సిటీ శాస్త్రవేత్త‌లు చేసిన ఈ అధ్య‌య‌నం ఫ‌లితాలు నేచ‌ర‌ల్ క‌మ్యునికేష‌న్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. ఇన్ఆర్గానిక్ మిన‌ర‌ల్స్‌తో ఉండే మూల‌కాలు జీవం ఉద్భ‌వించ‌డానికి అత్య‌వ‌స‌రం అని తెలిసిందే. 350 కోట్ల సంవ‌త్స‌రాల క్రితం ఇటువంటి మూల‌కాలు ఎలా రూపొందాయ‌న్న‌ది తెలుసుకోవ‌డ‌మే ఈ అధ్య‌య‌నాల ఉద్దేశం.


ఇందులో భాగంగా ప‌రిశోధ‌కులు హైడ్రోజ‌న్‌, బైకార్బొనేట్‌, ఐర‌న్ మోతాదు ఎక్కువ‌గా ఉన్న మాగ్నెటైట్‌ల‌ను క‌లిసి.. వేడి నీటి బుగ్గ ప‌రిస్థితుల‌ను కృత్రిమంగా సృష్టించారు. త‌ర్వాత ఆ మిశ్ర‌మాన్ని గ‌మ‌నిస్తే ప‌దుల కొద్దీ ఆర్గానిక్ మూలకాలు ఏర్ప‌డిన‌ట్లు తేల్చారు. ప్ర‌ధానంగా 18 కార్బ‌న్ అణువుల‌తో ఉండే ఫ్యాటీ యాసిడ్‌లు శాస్త్రవేత్త‌లను ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. భూ అంత‌ర్భాగంలో ఉన్న హైడ్రోజ‌న్ ప్ర‌భావిత వేడి నీరు.. కార్బ‌న్ డై ఆక్సైడ్ స‌మ‌క్షంలో స‌ముద్ర‌పు నీటితో క‌లిసిన‌పుడు ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏర్ప‌డి ఉంటాయ‌ని ఈ ప‌రిశోధ‌న‌లో తేలింది. ఇవే ప్రాథ‌మిక మెంమ‌బ్రేన్‌లుగా త‌ద్వారా ఏక క‌ణ జీవులుగా మారి ఉంటాయ‌ని శాస్త్రవేత్త‌లు అభిప్రాయ‌పడుతున్నారు.


‘మా అభిప్రాయంలో భూమిపై జీవం ఎలా, ఎక్క‌డ ఏర్ప‌డి ఉంటుంద‌న‌డానికి ఈ ప‌రిశోధ‌న ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. త్వ‌ర‌లోనే మేము ఈ ప‌రిశోధ‌న‌లో మ‌రింత లోతుకు వెళ్ల‌నున్నాం. భూమి కింద ల‌వ‌ణాలకు అంటిపెట్టుకు ఉండే మూల‌కాలు.. క‌ణాలు రూపొందేందుకు వీలుగా ఎందుకు, ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.. అనే విష‌యాలు క‌నుగొంటాం’ అని అధ్య‌య‌నానికి నేతృత్వం వ‌హించిన డా.జాన్ టెల్లింగ్ వివ‌రించారు. ఇదే ప్ర‌క్రియ మ‌న స‌ముద్రాల‌లోనూ, సౌర కుటుంబంలోని గ‌డ్డ‌క‌ట్టిన మంచు ప‌ర్వ‌తాల‌లోనూ జ‌రిగి ఉండొచ్చ‌ని అక్క‌డా జీవం ఎక్క‌డో అక్క‌డ ఉండి ఉండొచ్చ‌ని చెప్పుకొచ్చారు.

Latest News