తన బందీలను తానే చంపుకొన్న ఇజ్రాయెల్‌

హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో జరుపుతున్న దాడుల్లో శత్రువులుగా భావించి పొరపాటు పడి ఇజ్రాయిల్ సైన్యం ముగ్గురి బందీలను కాల్చి చంపింది. ఈ విషయాన్ని ఐడిఎఫ్ స్వయంగా వెల్లడించింది

  • Publish Date - December 16, 2023 / 01:34 PM IST
  • అంతులేని విషాదమన్న బెంజిమిన్‌ నెతన్యాహు
  • ఐడీఎఫ్‌ కాల్పుల్లో ముగ్గురు బందీలు మృతి

టెల్‌అవీవ్: హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో జరుపుతున్న దాడుల్లో శత్రువులుగా భావించి పొరపాటు పడి ఇజ్రాయిల్ సైన్యం ముగ్గురి బందీలను కాల్చి చంపింది. ఈ విషయాన్ని ఐడిఎఫ్ స్వయంగా వెల్లడించింది. దీనిపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అంతులేని విషాదమని వ్యాఖ్యానించారు. ‘మన ముగ్గురు బందీల మృతితో నేను కూడా దుఃఖంతో తలవంచుకుంటున్నాను. ఇది అంతులేని విషాదం. ఈ వార్త తెలిసిన తర్వాత ఇజ్రాయిల్ ప్రజలంతా దుఃఖంలో మునిగిపోయారు.


ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాల గురించి నా ఆలోచన అంతా. తమ ప్రాణాలను పణంగా పెట్టి బందీలను విడిపించేందుకు పోరాడుతున్న మన సైనికులు మనోబలంతో ముందుగా సాగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో బందీలను సురక్షితంగా తీసుకువచ్చేందుకు పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం’ అని నెతన్యాహూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మృతి చెందిన వారిలో ఒకరు ఇజ్రాయిల్లోని కెఫార్ ఆజా ప్రాంతానికి చెందిన యోటమ్ హైమ్ కాగా మరొకరు కీబుట్జ్ నిర్ అమ్ ప్రాంతానికి చెందిన వారిగా సైన్యం గుర్తించింది.


మూడో వ్యక్తి పేరును కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గోప్యంగా ఉంచింది. హమాస్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 18 వేల మందికి పైగా మృతి చెందారు. దాంతో గాజాలో యుద్ధాన్ని ఆపాలని అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. కనీసం మానవతా సహాయం అందించేందుకు వీలుగా యుద్ధ తీవ్రతను తగ్గించాలని అమెరికాతో సహా పలు దేశాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో బందీల మృతి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన భద్రత సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఇది తీవ్ర ఆందోళనకరమైన విషాదం అని శ్వేత సౌధ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి విచారం వ్యక్తం చేశారు. ఇందుకు దోహదం చేసిన పరిస్థితులపై ఇజ్రాయిల్ విచారణ జరుగుపుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.