ఇట‌లీ డైవ‌ర్ల‌కు స‌ముద్ర‌గ‌ర్భంలో క‌నిపించిన భారీ నిధి

  • Publish Date - November 7, 2023 / 09:11 AM IST

స‌ముద్రాల్లో ఎన్నో నిధులుంటాయని సినిమాల్లోనూ జాన‌ప‌ద క‌థ‌ల్లోనూ వినిసిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అవి నిజ‌మైన సంద‌ర్భాలూ ఉన్నాయి. తాజాగా ఇట‌లీ (Italy) డైవ‌ర్ల‌కు దొరికిన నిధి ప్ర‌పంచాన్ని ఆక‌ర్షిస్తోంది. ఒక‌టి కాదు రెండు కాదు స‌ముద్ర గ‌ర్భం నుంచి వారు వేల కొద్దీ పురాత‌న కాయిన్ల‌ను బ‌య‌ట‌కు తీశారు. రోమ‌న్ సామ్రాజ్యానికి చెందిన ఈ ఇత్త‌డి కాయిన్లు సుమారు 4వ శ‌తాబ్దానికి చెందినవ‌ని ఆ దేశ సాంస్కృతిక శాఖ వెల్ల‌డించింది.


హెరిటేజ్ డైలీ అనే ప‌త్రిక వెలువ‌రించిన క‌థ‌నం ప్ర‌కారం.. ఈ కాయిన్లు 30 వేల నుంచి 50 వేల వ‌ర‌కు ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ఈ నిధి చాలా విచిత్ర‌మైన‌దని.. అరుదైన‌దని ఆ క‌థ‌నం పేర్కొంది. వాటి బ‌రువును బ‌ట్టి అవి ఎన్ని ఉండొచ్చో ఈ క‌థ‌నం అంచ‌నా వేసింది. పురాత‌త్వ శాస్త్రవేత్త‌లు ఈ కాయిన్ల‌ను వాటిపై ఉన్న సంవ‌త్స‌రం ఆధారంగా స‌ర్ద‌గా.. తొలి కాయిన్‌పై కామ‌న్ ఎరా 324, చివ‌రి కాయిన్‌పై 340 అని ఉంది. దీనిని బ‌ట్టి ఆ కాయిన్లు ఆ రెండు సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలానికి సంబంధించినవని అర్థ‌మ‌వుతోంది.


రోమ‌న్ సామ్రాజ్యం గురించి అనేక విష‌యాలు ఇంకా బ‌య‌ట‌ప‌డాల్సి ఉంద‌ని.. ఇలాంటి నిధులు దొర‌క‌డం వ‌ల్ల అరుదైన స‌మాచారం దొరికే అవ‌కాశ‌ముంద‌ని పురాతత్వ శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. చ‌రిత్ర ప్ర‌కారం మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రంలో ఇంకా అనేక నిధులున్న‌ట్లు తెలుస్తోంద‌ని..వాటిని బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ఇట‌లీ అధికారులు వెల్ల‌డించారు. కాగా ఇదే కాలానికి సంబంధించిన కాయిన్లు 2013లో యునైటెడ్ కింగ్‌డంలోనూ బ‌య‌ట‌ప‌డ్డాయి. వాటి సంఖ్య 22,888గా న‌మోదైంది.

Latest News