అంతరిక్షంలోకి రెండు దేశాలు పంపిన ఉపగ్రహాలు, ఇతర పరికరాలు సంభాషించుకోవడం అరుదుగా జరిగే విషయం. అదీ చంద్రుని మీద సంభాషించుకుంటే.. అది మరీ అరుదైన సన్నివేశం. అలాంటి సంభాషణ ఒకటి నాసా (NASA) , ఇస్రో (ISRO) పరికరాల మధ్య జరిగింది. ప్రస్తుతం చంద్రుని చుట్టూ నాసాకు చెందిన ఒక ఆర్బిటర్ పరిభ్రమిస్తూ ఉండగా… ఇస్రోకు చెందిన ఒక ఆర్బిటర్‌తో పాటు విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై ఉన్నాయి. తాజాగా నాసాకు చెందిన ఆర్బిటర్ , విక్రమ్ ల్యాండర్ మధ్ సంబంధం ఏర్పడిందని నాసా, ఇస్రో సంయుక్తంగా ప్రకటించాయి. చంద్రునిపై మొట్టమొదటి సారి లేజర్ కాంతిపుంజాన్ని ప్రసరింపజేసి తిరిగి రాబట్టగలిగాం.
నాసా ఆర్బిటర్ నుంచి ఇస్రోకు చెందిన విక్రమ్ ల్యాండర్ మధ్య ఈ లేజర్ బట్వాడా జరిగింది. చంద్రునిపై లక్ష్యాలను కానీ, ఏదైనా ప్రదేశాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించే దిశలో ఈ ప్రయోగం ఒక సానుకూల ఫలితాలను ఇచ్చింది అని ఆ ప్రకటనలో రెండు పరిశోధనా సంస్థలూ పేర్కొన్నాయి. విక్రమ్ ల్యాండర్‌కు ఉన్న లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ ఎరే (ఎల్ఆర్ఏ)ను నాసానే రూపొందించింది. అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యానికి గుర్తుగా ఈ పరికరాన్ని నాసా తయారుచేసి ఇస్రోకు అందజేసింది. దానిని ఇస్రో విక్రమ్ ల్యాండర్‌కు అమర్చింది. తాజా పరిశోధనలో ఈ పరికరమే నాసా ఆర్బిటర్ నుంచి లేజర్ ను గ్రహించి దానిని తిరిగి పరావర్తనం చేసింది. 2023, డిసెంబరు 13న చంద్రునిపై రాత్రి కొనసాగుతున్న వేళ ఈ పరిశోధనను నిర్వహించారు. ఆ సమయంలో విక్రమ్ ల్యాండర్‌కు నాసా ఆర్బిటర్ తూర్పు వైపుగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నాసా తయారుచేసిన ఈ ఎల్ఆర్ఏలను మ్యాపింగ్ పాయింట్లుగా ఉపయోగిస్తారు. మనిషి చంద్రునిపై పరిశోధనలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి జాబిల్లి ఉపరితలంపై పలు ఎల్ఆర్ఏలను వివిధ దేశాల పరిశోధకులు పలు మార్గాల్లో అక్కడకు చేర్చారు. అయితే జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ఇస్రో పంపిన ఎల్ఆర్ఏనే మొదటిది కావడం విశేషం. భవిష్యత్తు అవసరాలకు, ఉపగ్రహాల స్థానాన్ని అత్యంత కచ్చితత్వంతో అంచనా వేయడానికి, విక్రమ్ ల్యాండర్‌కు ఉన్న ఎల్ఆర్ ఏ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సైన్స్ అంశాలను పక్కన పెడితే..ఈ ప్రయోగాన్ని రెండు పరికరాలు మాట్లాడుకున్న రొమాంటిక్ సంభాషణగా అనుకోవచ్చని వారు వ్యాఖ్యానించారు.