Asteroids | విశాల అంతరిక్షంలో ఏ గమ్యం లేకుండా గ్రహశకలాలు తిరుగుతుంటాయి. ఇప్పటికే పలు ఆస్టరాయిడ్స్ భూమికి దగ్గరగా ప్రయాణించిన విషయం తెలిసిందే. తాజాగా మూడు ఆస్టరాయిడ్స్ భూమి వైపుగా దూసుకువస్తున్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ఈ మూడు గ్రహశకలాలు శక్తివంతమైనవని.. ఇవి శనివారం నుంచి సోమవారం మధ్య భూమికి సమీపంగా వెళ్తాయని జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ పేర్కొంది. భూమి వైపుగా వస్తున్న వాటితో ఎలాంటి ప్రమాదం ఉండబోదని స్పష్టం చేసింది. మూడు ఆస్టరాయిడ్స్‌లో పెద్దది కేహెచ్3-2024 అని తెలిపింది. ఇది 610 అడుగులు వరకు ఉటుందని.. ఇది పొడవైన భారీ భవనం పరిమాణంలో ఉంటుందని చెప్పింది.
కేహెచ్3 గ్రహశకలం శనివారం భూమికి 5.6 మిలియన్ కిలోమీటర్ల దగ్గరగా వస్తుందని చెప్పింది. దాంతో ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేసింది. రెండో గ్రహశకలం పీకే1 శనివారమే భూమికి దగ్గరగా వస్తుందని.. ఈ దాదాపు 110 అడుగుల వ్యాసంలో ఉంటుందని పేర్కొంది. ఈ గ్రహశకలం 6.4 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమిని దాటి వెళ్తుందని పేర్కొంది. మూడో గ్రహం ఓఎన్2-2024 ఈ నెల భూ గ్రహానికి దగ్గరగా వస్తుందని.. ఇది 120 అడుగులు ఉంటుందని చెప్పింది. ఈ గ్రహశకలం భూమికి 6.8 మిలియన్ కిలోమీటర్లు దగ్గరగా వస్తుందని నాసా పేర్కొంది. ఈ గ్రహశకలాలతో ఎలాంటి ముప్పు లేదని.. అయితే.. భూమి భద్రతను దృష్టిలో ఉంచుకుని వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు వివరించింది.