Pakistani Beggars | పాకిస్తాన్ బిచ్చ‌గాళ్ల ఆదాయం ఏడాదికి రూ. 4,200 కోట్లు అట‌..!

Pakistani Beggars | ఒక బిచ్చ‌గాడి( Beggar ) ఆదాయం ఎంత ఉంటుంది.. వంద‌లు, వేల రూపాయాలు ఉంటుంది. కొంత మంది బిచ్చ‌గాళ్ల వ‌ద్ద ల‌క్ష‌ల ఆదాయం ఉండి ఉండొచ్చు. కానీ ఈ బిచ్చ‌గాళ్ల( Beggars ) ఆదాయం ఏడాదికి కోట్ల రూపాయాల్లో ఉంది. కోట్ల రూపాయాలు సంపాదిస్తున్న బిచ్చ‌గాళ్లు ఎవ‌రో కాదు.. దాయాది దేశం పాకిస్తాన్‌( Pakistan )కు చెందిన వార‌ని ఆ దేశ మీడియా సంస్థ డాన్( Dawn ) వెల్ల‌డించింది.

Pakistani Beggars | భిక్షాట‌న‌కు పెట్టింది పేరు పాకిస్తాన్( Pakistan ) అట‌. భిక్షాట‌న‌నే వృత్తిగా ఎంచుకుని కోట్లాది మంది పాకిస్తానీయులు( Pakistani Beggars ) త‌మ జీవితాన్ని సాగిస్తున్నార‌ట‌. సొంత గ‌డ్డ‌పైనే కాదు.. విదేశాల్లోనూ పాకిస్తానీయులు భిక్షాట‌న( Begging ) చేసి కోట్ల రూపాయాలు సంపాదిస్తున్నార‌ట. దీంతో పాకిస్తాన్ ప్ర‌తిష్ఠ అంత‌ర్జాతీయంగా దెబ్బ‌తింటోంద‌ని ఆ దేశం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు పాక్ మీడియా సంస్థ డాన్( Dawn ) నివేదిక‌లో వెల్ల‌డైంది.

పాకిస్తాన్ జ‌నాభా 23 కోట్లు కాగా, ఇందులో 3.8 కోట్ల మంది భిక్షాట‌న‌ను వృత్తిగా ఎంచుకుని జీవ‌నం కొన‌సాగిస్తున్నార‌ట‌. పాకిస్తాన్ బిచ్చ‌గాళ్లంద‌రూ క‌లిసి ఏడాదికి 42 బిలియ‌న్ డాల‌ర్లు సంపాదిస్తున్నార‌ట‌. అంటే మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో అక్ష‌రాలా.. రూ. 4,200 కోట్లు.

డాన్ రిపోర్టు ప్ర‌కారం.. 3.8 కోట్ల మంది యాచ‌కులు క‌లిసి ఏడాదికి రూ. 4,200 కోట్లు సంపాదిస్తున్నార‌న్న మాట‌. ఇది ఆ దేశ ద్ర‌వ్యోల్బ‌ణం( Inflation ) పెర‌గ‌డానికి కూడా ఒక కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఏషియ‌న్ హ్యుమ‌న్ రైట్స్ క‌మిష‌న్(AHRC) లెక్క‌ల ప్ర‌కారం.. పాకిస్తాన్ జనాభా( Pakistan Population )లో 2.5 నుండి 11 శాతం మంది జీవనోపాధి కోసం భిక్షాటన చేస్తున్నారు. దేశంలోని ప్రధాన పట్టణ కేంద్రాల వీధుల్లో సుమారు 12 లక్షల మంది పిల్లలు భిక్షాట‌న చేస్తూ తిరుగుతున్నారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ గణాంకాలు చెబుతున్నాయి.

పాక్‌కు విదేశాల ఫిర్యాదులు..

చాలా మంది పాకిస్తానీయులు యాచించేందుకు విదేశాల‌కు వెళ్తున్న‌ట్లు పాకిస్తాన్ ప్ర‌భుత్వ స‌ర్వేలో తేలింది. విదేశాలలో పట్టుబడిన యాచ‌కుల‌లో 90 శాతం మంది పాకిస్తానీయులు ఉన్న‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన యాచకుల‌పై ఇరాక్, సౌదీ రాయ‌బారులు పాకిస్తాన్ ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేసిన ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలో సౌదీ అరేబియా( Saudi Arabia ), ఇరాక్( Iraq ), ఇరాన్( Iran ) వెళ్తున్న‌ వేలాది మంది యాచ‌కుల పాస్‌పోర్టుల‌ను కూడా పాక్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఈ యాచ‌కులంతా మ‌త‌ప‌ర‌మైన యాత్ర‌ల పేరిట విదేశాల‌కు వెళ్లి అక్క‌డ భిక్షాట‌న చేస్తున్న‌ట్లు తేలింది. గ‌త రెండున్న‌రేండ్ల కాలంలో 44 వేల మంది యాచ‌కుల‌ను సౌదీ అరేబియాతో ఇత‌ర గ‌ల్ఫ్ దేశాలు పాకిస్తాన్‌కు తిప్పిపంపాయి.