చిరిగిన బట్టలు, చింపిరి జుట్టుతో రోడ్లపై భిక్షాటన (beggar) చేసుకునే వారిని చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. వాళ్లు చేయి చాచి అడగ్గానే మనకు తోచిన సాయం చేస్తుంటాం. రూపాయో, రెండు రూపాయలో లేదంటే ఏదైనా తినడానికి ఇవ్వడమో చేస్తుంటాం. అదే వికలాంగ భిక్షగాళ్లను చూస్తే ఏమాత్రం ఆలోచించకుండా ధర్మం చేస్తాం. కానీ, మీరు ధర్మం చేసిన ఆ బిచ్చగాడు కోటీశ్వరుడైతే..? మీకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉంటే..? మీకు లేని ఇళ్లు, కారు, కావల్సినంత డబ్బుతో లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తుంటే..? వినడానికే షాకింగ్‌గా అనిపిస్తోంది కదూ. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో ఓ బిచ్చగాడు కోట్లకు పడగలెత్తాడు. అతడి ఆస్తులు చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇండోర్‌కు దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరుంది. అయితే, ఇప్పుడు ‘బిచ్చగాళ్లు లేని నగరం’గా మార్చాలని జిల్లా యంత్రాంగం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ (Beggar Eradication Campaign) నిర్వహించి.. రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సరాఫా ప్రాంతంలో మంగీలాల్ అనే వికలాంగ బిచ్చగాడిని అధికారులు గుర్తించారు. అతను చక్రాల బండిపై తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. కానీ, అతడి కదలికలు అనుమానాస్పదంగా అనిపించాయి. దీంతో మున్సిపల్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. అతడు ఇండోర్‌లోనే కోటీశ్వర బిచ్చగాడు (Indore crorepati beggar) అని తేలింది.
మంగీలాల్‌కు ఇండోర్ నగరంలోనే మూడు ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భగత్ సింగ్ నగర్‌లో మూడంతస్తుల ఇల్లు , శివనగర్ ప్రాంతంలో ఓ ఇల్లు ఉన్నాయి. వీటిని అతనే సొంతంగా నిర్మించాడు. అంతేకాదు, దివ్యాంగుడనే కారణంతో రెడ్ క్రాస్ సొసైటీ నుంచి అల్వాస్ ప్రాంతంలో మరో ఇంటిని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వీటన్నింటినీ అద్దెకు ఇచ్చాడు. అంతేకాదు, ఈ కోటీశ్వరుడైన బిచ్చగాడు.. ఫైనాన్స్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. ఏకంగా బంగారం వ్యాపారులకే రూ.లక్షల్లో వడ్డీలకు ఇచ్చాడు. అది కూడా నెలవారీ వడ్డీ కాదండోయ్.. వారం వడ్డీ, రోజువారీ వడ్డీ లెక్కన వసూలు చేస్తాడు. జనం దగ్గర చిల్లర తీసుకుని, వ్యాపారులకు నోట్ల కట్టలు అప్పుగా ఇస్తున్నాడు.
మంగీలాల్‌కు సొంతంగా కారు ఉంది. అతను భిక్షాటన కోసం చక్రాల బండి వాడతాడు కానీ.. వ్యక్తిగత పనులకు, ఇండోర్ నుంచి బయటి ప్రాంతానికి వెళ్లాలంటే మాత్రం కారులో వెళ్తాడు. అంతేకాదండోయ్.. కారు నడిపేందుకు డ్రైవర్‌ను కూడా పెట్టుకున్నాడు. ఆ డ్రైవర్‌కు నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ జీతం ఇస్తున్నాడు. అతని వ్యాపార సామ్రాజ్యం ఇంతటితో ఆగలేదు.. భిక్షాటన, వడ్డీ వ్యాపారం, ఇల్లు అద్దెలే కాకుండా మూడు ఆటోలను కొనుగోలు చేసి వాటిని కూడా అద్దెకు తిప్పుతూ భారీగానే సంపాదిస్తున్నాడు. అతడి ఆస్తులు చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజల సానుభూతిని పెట్టుబడిగా మార్చుకుని మంగీలాల్ కోట్లు గడించినట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో అతడి గురించి మరింత కూపీలాగేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, ఇతర ఆస్తుల చిట్టాను బయటకు తీసేందుకు విచారిస్తున్నారు. ఈ బిచ్చగాడి వ్యవహారం ఇండోర్ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి :
Silver Gold Price|వెండి ధర కొత్త రికార్డు..పెరిగిన బంగారం ధరలు
Pongal Movies | సంక్రాంతి 2026 బాక్సాఫీస్ విజేతలు యువ హీరోలే.. సీనియర్లకి గట్టి షాక్ ఇచ్చారుగా..!
