సియోల్: పారాసైట్ సినిమాలో తన విలక్షణ నటనకు గాను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న దక్షిణ కొరియా నటుడు లీ సన్ క్యూన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. బుధవారం సియోల్‌లోని ఒక ప్రధాన పార్కు వద్ద తన కారులో ఆయన అపస్మారక స్థితిలో కనిపించాడు. అయితే.. లీ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వేరే కారణాలు ఉన్నాయా? అన్న విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళుతూ ఒక నోట్ రాసి పెట్టాడని తెలుస్తున్నది.
48 ఏళ్ల లీ.. అక్టోబర్ నుంచి మాదక ద్రవ్యాల కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన సినీ రంగంలో ఉన్నాడు. నటి జీయాన్ హే జిన్‌ను ఆయన వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదట్టో టీవీ షోలు, పదుల కొద్దీ సినిమాలతో 2010 దశకంలో దక్షిణ కొరియాలో బాగా ప్రాచుర్యం పొందాడు. పారాసైట్ సినిమాతో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు.
ఆస్కార్ ఉత్తమ సినిమా పురస్కారం పొందిన తొలి నాన్ ఇంగ్లిష్ మూవీ పారాసైట్. డ్రగ్స్ కేసులో చిక్కుకోకు ముందు లీ క్లీన్ ఇమేజ్‌తో ఉండేవాడు. కానీ.. ఈ కేసు ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. అక్టోబర్‌లో షూటింగ్ మొదలైన ‘నో వే అవుట్’ అనే మిస్టరీ టీవీ సీరియల్ నుంచి ఆయనను తప్పించారు. మాదక ద్రవ్యాల వినియోగం దక్షిణ కొరియాలో తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఉల్లంఘించినవారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.