Site icon vidhaatha

Fine | లేని సీట్లకు టికెట్‌లు అమ్మిన ఎయిర్‌లైన్స్‌.. ఫలితం రూ.550 కోట్ల జరిమానా..!

Fine : ఆస్ట్రేలియాకు చెందిన ఓ విమానయాన సంస్థ అత్యాశకుపోయి భంగపడింది. లాభాల కోసం అక్రమ విధానాలను అనుసరించిన ఆస్ట్రేలియా విమానయాన సంస్థ కాంటాస్‌ (Qantas) చివరకు తగిన మూల్యం చెల్లించుకుంది. ‘ఘోస్ట్‌ ఫ్లైట్స్‌’ పేరిట ప్రాచుర్యం పొందిన కుంభకోణంలో 66 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.550 కోట్లు) జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాస్తవానికి ముందుగానే రద్దయిన విమానాల్లోని టికెట్లను సైతం కాంటాస్‌ (Qantas) విక్రయిస్తూ వచ్చింది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా అంగీకరించిందని ఆస్ట్రేలియా ఎయివేస్‌ నియంత్రణ సంస్థ తెలిపింది. దాంతో కాంటాస్‌కు 66 మిలియన్‌ డాలర్ల జరిమానాతోపాటు 86 వేల మంది ప్రయాణికులకు 13 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించినట్లు వెల్లడించింది.

లాభాల కక్కుర్తితో కంపెనీ చేసిన నిర్వాకం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కాంటాస్‌కు ఆస్ట్రేలియా ఎయివేస్‌ నియంత్రణ సంస్థ చీవాట్లు పెట్టింది. అనేక మంది వ్యాపారులు, పర్యాటకులు రద్దు చేసిన విమానాల్లోని టికెట్లు బుక్‌ చేసుకొని నష్టపోయారని తెలిపింది. ‘మూడు రోజుల ముందే రద్దయిన విమానాల టికెట్లను సైతం విక్రయించాం. మా కస్టమర్లకు నష్టం కలిగించాం. ప్రమాణాలను పాటించడంలో విఫలమయ్యాం. ప్రయాణికులకు సకాలంలో నోటిఫికేషన్లు పంపలేకపోయాం. దానికి క్షమాపణ చెబుతున్నాం’ అని కాంటాస్‌ సీఈఓ వనెస్సా హడ్సన్‌ తమ తప్పును అంగీకరించారు.

కాగా, దాదాపు 103 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ ఈ తరహా అనైతిక విధానాలను అవలంబించడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల ధరలు పెంచడం, సేవల నాణ్యతలో లోపాలు, కరోనా సమయంలో 1,700 మంది సిబ్బంది తొలగింపు వంటి అంశాల్లోనూ ఈ సంస్థ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. గత ఏడాది ఈ కంపెనీ 1.1 బిలియన్‌ డాలర్ల లాభాన్ని నమోదు చేసింది.

Exit mobile version