Site icon vidhaatha

Race Car crashes | ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..!

Race Car crashes : శ్రీలంకలో కారు రేస్‌ విషాదాన్ని మిగిల్చింది. కారు రేస్‌ చూస్తూ ఎంజాయ్‌ చేసేందుకు వెళ్లిన ప్రేక్షకులు అనుకోని పరిణామంతో ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్‌పై వెళ్తున్న రేస్‌ కారు అదుపుతప్ప ఒక్కసారిగా ప్రేక్షకులపైకి దూసుకెళ్లింది. దాంతో అక్కడున్న ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

శ్రీలంక రాజధాని కొలంబోకు తూర్పున 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ హిల్స్ దియాతలావా పట్టణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఆర్మీ, శ్రీలంక ఆటోమొబైల్ స్పోర్ట్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కారు రేస్‌ విషాదాన్ని మిగిల్చింది. రేసును వీక్షించేందుకు వేలాది మంది తరలి వచ్చారు. అయితే అనుకోని ఘటనతో వారంతా షాకయ్యారు.

ఈ ఘటనపై అక్కడి పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. రేస్‌ కార్లలో ఒకటి ట్రాక్ నుంచి తప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లిందన్నారు. ఈ ఘటనలో రేస్‌ నిర్వహణ విధుల్లో ఉన్న నలుగురు అధికారులు సహా ఏడుగురు మరణించారని, మరో 20 గాయపడ్డారని ఆయన చెప్పారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద ఘటన తర్వాత రేస్‌ను నిలిపివేసినట్లు చెప్పారు. శ్రీలంక ఆర్మీ, శ్రీలంక ఆటోమొబైల్ స్పోర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 24 ఈవెంట్లలో ఇది 17వది అని తెలిపారు.

Exit mobile version