Anura Kumara Dissanayaka Profile । శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనుర కుమార దిస్సనాయకే (Anura Kumara Dissanayake) సోమవారం ఆ దేశ 9వ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. కొలంబోలోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్‌లో ఆయనతో చీఫ్ జస్టిస్ జయంత జయసూరియ శ్రీలంక అధ్యక్షుడిగా (President of Sri Lanka) ప్రమాణం చేయించారు. 2019 అధ్యక్ష ఎన్నికల్లో దిస్సనాయకేకు 3.2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ.. తరువాతి కాలంలో ఆయన కృషి, పోరాటాలు ఆయనను ప్రజలకు దగ్గర చేశాయి. దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు దోహదం చేశాయి. దిస్సనాయకే తీసుకున్న అవినీతి వ్యతిరేక (anti-corruption) వైఖరి, సామాజిక న్యాయం, ఆర్థిక సంస్కరణల నినాదాలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయి.
రణిల్ విక్రమసింఘే సాజిత్ ప్రేమదాస లేదా నమల్ తరహాలో రాజకీయ వారసత్వం ఉన్న భాగ్యవంతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు దిస్సనాయకే. ఆయన ఒక కూలీ కొడుకు. తల్లి సాధారణ గృహిణి. 1968 నవంబర్ 24న అనురాధాపుర జిల్లా తమబుతెగామాలో ఆయన పుట్టారు. 1987 జేవీపీ ఉద్యమంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తంబుతెగామా సెంట్రల్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆయన విద్యార్థి రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. విద్యార్థి రాజకీయాల దశలోనే ఆయన శ్రీలంకలోని మార్క్సిస్టు – లెనినిస్టు ఆలోచనా ధోరణితో కూడిన జనతా విముక్తి పెరమున (జేవీపీ)లో చేరారు. 1987-89 మధ్యకాలంలో జేవీపీ తిరుగుబాటు (insurrection) సమయంలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత పెదదేనియా యూనివర్సిటీలో చేరినా.. బెదింపుల నేపథ్యంలో కెలానియా యూనివర్సిటీకి మారారు. అక్కడే భౌతికశాస్తంలో పట్టభద్రుడయ్యారు.
1995లో సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్ (Socialist Students Association) జాతీయ ఆర్గనైజర్‌గా ఎన్నికైన అనర కుమార దిస్సనాయకే.. అదే ఏడాది జేవీపీ కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, తదుపరి 1998లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. చంద్రికా కుమారతుంగ (Chandrika Kumaratunga) అధికారంలోకి వచ్చిన తర్వాత సోమవాన్స అమరసింఘే నేతృత్వంలో జేవీపీ ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వచ్చింది. 2014లో దిస్సనాయకే ఒకప్పటి విప్లవ పార్టీ అయిన జేవీపీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. దేశంలో రెండు విఫల తిరుగుబాట్లకు జేవీపీ నాయకత్వం వహించింది. ఒకటి 1971లో, మరోటి 1987-89లో. ఈ రెండు తిరుగుబాట్ల సందర్భంగా దాదాపు 80 వేల మంది చనిపోయారు. దేశంలో సోషలిస్టు రాజ్యంగా మార్చే క్రమంలోనే ఈ రెండు తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి.