Doctor | రోగులకు జబ్బులను నయం చేయాల్సిన డాక్టరే.. కీచకుడిగా మారాడు. వైద్యం కోసం వచ్చే రోగులపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దాదాపు తన 30 ఏండ్ల సర్వీసులో 299 మంది రోగులపై అత్యాచారం చేశాడు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. ఈ కీచక డాక్టర్ అబ్బాయిలను కూడా వదల్లేదు. చివరకు ఈ అత్యాచార కేసుల్లో వైద్యుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.
వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్‌లోని బ్రిటానీ అనే ప్రాంతంలో నిందితుడు జియోల్ లీ స్కౌర్‌నెక్( Joel Le Scouarnec ) (74) వృత్తిరీత్యా వైద్యుడు. స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో సర్జన్‌గా పని చేసేవాడు. ఇక తన వద్దకు వైద్యం కోసం వచ్చే రోగులను లైంగికంగా వేధించేవాడు. రోగులకు మత్తు మందు ఇచ్చి 30 ఏండ్ల పాటు 299 మంది రోగులపై అత్యాచారం చేశాడు. ఆ డాక్టర్ అకృత్యాలు 2017లో బయటపడ్డాయి. తన ఇంటి పక్కనున్న ఓ ఆరేండ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, తాకరాని చోట తాకడంతో జియోల్‌పై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా జియోల్ ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా.. ఏకంగా 3 లక్షలకు పైగా ఫొటోలు బయటపడ్డాయి. 650లకు పైగా అశ్లీల వీడియోలు, నోట్‌బుక్స్‌ను కూడా గుర్తించారు.
శృంగార ఆసక్తి తనకు ఎక్కువగా ఉన్నట్టు, అది కూడా చిన్నారులపై లైంగికదాడికి పాల్పడాలనే కోరిక ఉన్నట్టు డాక్టర్ జియోల్ తన డైరీలో రాసుకున్నాడు. దీన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇక ఎవరిపై ఎప్పుడు అత్యాచారం చేశాడో.. ఆ వివరాలను కూడా రాసుకున్నాడు జియోల్. ఆరేండ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన తర్వాత మరో నలుగురు చిన్నారులు కూడా అతడి బాధితులని తేలారు. దీనితో 2020లో కోర్టు జియోల్‌ను దోషిగా తేల్చి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా, అతడి పాపాల చిట్టా బయటపడింది.
1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయస్థానంలో జియోల్ తెలిపాడు. తాను చాలా క్రూరమైన పనులు చేశానని, ఆ పిల్లల మనసుకు అయిన ఈ గాయం ఎన్నటికీ మానదని తెలిసినా అలా ప్రవర్తించాని పేర్కొన్నాడు. ఈ చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నట్టు తెలిపాడు. కొన్ని ఘటనలు మాత్రం గుర్తు లేవని చెప్పాడు. మొత్తానికి జియోల్ దోషిగా తేలడంతో మరో 20 ఏండ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఫ్రాన్స్‌లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని సామాజికవేత్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు.