ఇక్క‌డి అయోధ్య‌లో ప్రాణ‌ప‌తిష్ఠ‌.. థాయిల్యాండ్‌ అయోధ్య‌లో సంబ‌రాలు.. ఏమిటీ సంబంధం?

మరి కొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌నున్న అయోధ్య రామాల‌య ప్ర‌తిష్ఠాప‌న మ‌హోత్స‌వానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న రామ‌భ‌క్తులు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే

  • Publish Date - January 20, 2024 / 10:31 AM IST

మరి కొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌నున్న అయోధ్య రామాల‌య ప్ర‌తిష్ఠాప‌న మ‌హోత్స‌వానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న రామ‌భ‌క్తులు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మంది భ‌క్తులు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య న‌గ‌రానికి చేరుకుని.. ఆ ఘ‌ట్టం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. కాగా ఇక్క‌డి అయోధ్య‌లోనే కాకుండా మ‌రో దేశంలో ఉన్న అయోధ్య‌లోనూ ప్ర‌జ‌లు ఎంతో సంతోషంగా ఈ ప్ర‌తిష్ఠాప‌న కార్య‌క్ర‌మాన్ని పండగలా జ‌రుపుకోనున్నారు. దీనిని అక్కడి ప్ర‌జ‌లు అయుథ‌య‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇది మ‌న అయోధ్య‌కు 3,500 కి.మీ. దూరంలో థాయ్‌ల్యాండ్ రాజ‌ధాని బ్యాంకాక్‌కు ఉత్త‌రంగా 70 కి.మీ. దూరంలో ఉంది. ప్ర‌పంచ సాంస్కృతిక వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తింపు పొందిన ఈ న‌గ‌రం థాయ్‌ల్యాండ్ ప్ర‌జ‌లు ప‌విత్రంగా భావించే చావో ఫ్ర‌యా న‌ది ఒడ్డున నిర్మిత‌మై ఉంది.ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఉండే రామ‌భ‌క్తి, అయోధ్య అనే పేరుపై ఉన్న మ‌మ‌కారం గురించి తెలుసుకుంటే.. ఎక్కడో వేల కి.మీ. దూరంలో ఉన్న ఒక న‌గ‌రానికి వీరికి అంత అనుబంధం ఎలా పెన‌వేసుకుంద‌న్న ఆస‌క్తి క‌ల‌గ‌క మాన‌దు.

మిగిలిన ఆగ్నేయాసియా దేశాల త‌ర‌హాలోనే థాయ్‌ల్యాండ్‌కు రామాయ‌ణం మొట్ట‌మొద‌టి సారి బౌద్ధ భిక్షువుల ద్వారా ప్ర‌వేశించిన‌ట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బౌద్ధులు మ‌త ప్ర‌చారం కోసం ద‌క్షిణాసియా దేశాల్లో ప‌ర్య‌టించిన‌ప్పుడు వారు రామాయ‌ణ‌, మ‌హాభార‌తాల‌ను కూడా అక్క‌డ ప్ర‌వ‌చ‌నాల రూపంలో చెప్పేవారు. అలా చాలా మంది స్థానికులు రామాయాణానికి ప్ర‌భావితుల‌య్యారు. కొంద‌రు రాజులైతే త‌మ‌ను తాము రాముని వంశ‌స్థులుగా ప్ర‌క‌టించుకుని.. రామాయణాన్ని స‌రికొత్త కోణంలో ర‌చ‌న‌లు చేయించేవారు. అలాంటి రాజుల‌లో ఒక‌రు యు థాంగ్‌. ఆయ‌న త‌న పేరును మ‌హారాజా రామాతిబోధిగా మార్చుకుని మరీ పాల‌న సాగించాడు. అత‌డు రామాయణాన్ని విశేషంగా ఆరాధించ‌డ‌మే కాకుండా అయోధ్య పేరుపై ఒక న‌గ‌రాన్ని కూడా నిర్మించాడు. అదే ఇప్ప‌టి అయుథ‌య‌. సుమారు 1350 ప్రాంతంలో ఈ న‌గ‌ర నిర్మాణం జ‌రిగిన‌ట్లు ఆధారాలున్నాయి. ఆ రాజు సియామీస్ రాజ్యానికి చెందిన వాడు కాగా.. అత‌డి త‌ద‌నంత‌రం కూడా ద‌శాబ్ధాల పాటు ఈ అయుథ‌య.. రెండో రాజ‌ధానిగా కొన‌సాగింది. 14వ శ‌తాబ్దం నుంచి 18వ శ‌తాబ్దం వ‌ర‌కు ఈ న‌గ‌రం ఒక అభివృద్ధి చెందిన ప‌ట్ట‌ణంగా, వాణిజ్య కేంద్రంగా ఓ వెలుగు వెలిగింది. అయితే 1767లో బ‌ర్మా సైన్యం ఈ న‌గ‌రం మీద ప‌డి.. నామ‌రూపాలు లేకుండా చేసేసింది. అక్క‌డ ఉన్న వారిని బ‌య‌ట‌కు త‌రిమికొట్టింది. త‌ర్వాత ఎంతో మంది ప్రయ‌త్నించినా ఆ న‌గ‌రాన్ని మ‌ర‌లా పునఃనిర్మించ‌లేక‌పోయారు. దీంతో ఆ న‌గ‌రం మ‌న విజ‌యన‌గ‌ర రాజ్యంలోని హంపి న‌గ‌రంగా ఒక జ్ఞాప‌కంలా మిగిలిపోయింది. ఇరు దేశాల మ‌ధ్య ఉన్న సంబంధాల‌ను వ‌ర‌ల్డ్ హిందూ ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ స్వామీ విజ్ఞానంద్ వివ‌రించారు. ‘అయుథ‌యను నిర్మించిన మ‌హారాజ రామాతిబోధి నుంచి త‌ర్వాత వ‌చ్చిన చ‌క్ర రాజ్యం రాజుల వ‌ర‌కు అంద‌రూ త‌మ‌ను తాము రాముని వార‌స‌లుగా భావించుకునేవారు. భార‌త్ నుంచి బౌద్ధుల ద్వారా వ‌చ్చిన రామాయ‌ణం నుంచి ఆత్మ‌ను తీసుకుని.. వీరు ర‌మాకిన్ అనే గ్రంథాన్ని రాసుకున్నారు. అలా రాముడు వీరి జీవ‌న విధానంపై ప్ర‌భావం చూపించాడు. బ్యాంకాక్ న‌గ‌రాన్ని నిర్మించిన రాజు పేరు కూడా రామా 1 కావ‌డం మ‌రో విశేషం’ అని ఆయ‌న వివ‌రించారు. భార‌త్‌లో హిందువుల‌కు రాముడు ఎలా దేవుడో.. ఆగ్నేయాసియాలో బుద్ధుల‌కు రాముడు అలానే అని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక బంధానికి గుర్తుగా అయుథ‌య నుంచి కూడా మ‌ట్టి, నీరును సేక‌రించి.. రామాల‌య నిర్మాణంలో ఉప‌యోగించారు. 22న బ్యాంకాక్ న‌గ‌రంతో పాటు ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల్లో భారీ తెర‌ల‌ను ఏర్పాటు చేసి ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్షప్ర‌సారం చేయనున్నారు. ఆ రోజున ప్ర‌ధాన దేవాల‌యాల్లో దీపాలు వెలిగించ‌డానికీ ఏర్పాట్లు పూర్త‌యిన‌ట్లు బ్యాంకాక్ విశ్వ హిందూ ప‌రిష‌త్ ప్ర‌తినిధి ఒక‌రు వివ‌రించారు. మ‌రోవైపు అయోధ్య వివాదంపై 2019లో సుప్రీంకోర్టు సుస్ప‌ష్ట తీర్పు ఇవ్వ‌డంతో.. రామాల‌య నిర్మాణానికి అడ్డు తొల‌గిపోయింది. అప్ప‌టి నుంచి నిర్మాణం మొద‌లుకాగా ప్ర‌స్తుతానికి తొలి ద‌శ ప‌నులు పూర్త‌య్యాయి. సోమ‌వారం నాడు ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య గ‌ర్భ‌గుడిలో బాల‌రాముడి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠించ‌నున్నారు.