Site icon vidhaatha

US Cancels 6000 Visas | విద్యార్థులకు ట్రంప్‌ బిగ్‌ షాక్‌..6వేల మంది విద్యార్థి వీసాల రద్దు!

trump-revokes-over-6000-student-visas

US Cancels 6000 Visas | విధాత : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులకు మరో బిగ్ షాక్ ఇచ్చాడు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాగా వలస వాదులపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ సర్కార్ 6 వేల మందికి పైగా విద్యార్థి వీసాలు రద్దుకు నిర్ణయించారు. వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీసాల రద్దు కారణాలను అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. నేర సంబంధిత ఆరోపణలతో పాటు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చారన్న ఆరోపణలతో వీసాలు రద్దు చేశారు. వీసాల రద్దుతో భారతీయ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అమెరికా చట్టాలను ఉల్లంఘించారన్న కారణంతోనే 4వేల వీసాలను రద్దు చేశారు. ఈ నేరాల్లో ఎక్కువగా దాడులు, డ్రక్ అండ్ డ్రైవ్, దొంగతనం వంటి చిన్నచిన్న నేరాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో రెండు నుంచి మూడువందల వీసాలను టెర్రరిస్ట్ గ్రూపులకు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలతో రద్దు చేశారు. అయితే వారు ఏ గ్రూపులకు మద్దతు ఇచ్చారనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. మరోవైపు వీసా అనేది రాజ్యాంగ హక్కు కాదని.. ఎప్పుడైనా కొత్త సమాచారం వెలుగులోకి వస్తే దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. విద్యార్థి వీసా అనేది మేము ఇవ్వాలని నిర్ణయించుకున్నది మాత్రమేనని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ప్రవర్తన గురించి ఏమీ తెలియకుండా వీసా ఇచ్చి.. ఆ తర్వాత అతడి నేర ప్రవృతి గురించి తెలిస్తే మేము వీసా రద్దు చేయకుండా ఎందుకు ఉంటామని రుబియో వ్యాఖ్యానించారు.

ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికా విశ్వవిద్యాలయాలు

ట్రంప్ వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపుతూ, కఠిన చర్యలు తీసుకోవడం వల్ల అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ కష్టపడి చదివి, డాలర్లను సంపాదించాలనే ఆశతో శ్రమిస్తున్న విద్యార్థులకు ట్రంప్ విధానాలు ప్రతికూలంగా మారాయి. విదేశీ విద్యార్థుల పట్ల ట్రంప్ తీసుకుంటున్న చర్యలపై ప్రముఖ యూనివర్సిటీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి కారణాలు చూపకుండా, చిన్నపాటి తప్పులకు కూడా వీసాలు రద్దు చేయడం సరికాదని యూనివర్సిటీలు అంటున్నాయి. ఈ నిర్ణయాలు అమెరికాలో విద్యాభ్యాసం పట్ల అంతర్జాతీయ విద్యార్థులకున్న ఆసక్తిని తగ్గిస్తాయని, అమెరికా ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని విద్యాసంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఈ నిర్ణయాలను సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Exit mobile version