న్యూఢిల్లీ, అక్టోబర్ 13 (విధాత ప్రతినిధి): అమెరికాలో విదేశీ విద్యార్థులకు 15 శాతం ఆడ్మిషన్లు మాత్రమే ఇవ్వాలని వైట్ హౌస్ నుంచి యూనివర్శిటీలకు ఆదేశాలు వెళ్లాయి. విదేశీ విద్యార్థుల ఆడ్మిషన్లను 15 శాతం కుదించిన యూనివర్శిటీలకే ప్రభుత్వం నుంచి నిధులు అందిస్తామని మెమో పంపారు. ఒకవేళ ఈ ఆదేశాలు పాటించని యూనివర్శిటీలకు ప్రభుత్వం నుంచి నిధులు అందకుండా చేయడమే ఈ మెమో ఉద్దేశం. ఒకవేళ ఈ నిబంధన అమలైతే భారత విద్యార్థులపై ఏ మేరకు ప్రభావం పడుతోందనే చర్చ సాగుతోంది. ఎంఐటీ, బ్రౌన్, పెన్సిల్వేనియా సహా అమెరికాలోని తొమ్మిది టాప్ యూనివర్శిటీలకు ఈ మెమో అందింది.
ఒక్క దేశం నుంచి ఐదు శాతం కంటే ఎక్కువ ఆడ్మిషన్లకు నో
అమెరికాలో పలు యూనివర్శిటీల్లో ఇతర దేశాల విద్యార్థులు ప్రతిఏటా చదువుకోవడానికి వస్తుంటారు. ఇలా రావడం ద్వారా యూనివర్శిటీలకు ఆదాయం కూడా వస్తోంది. అయితే విదేశీ విద్యార్థుల ఆడ్మిషన్లపై ట్రంప్ పాలకవర్గం తగ్గించాలనే ప్రతిపాదన చేసింది. విదేశీ విద్యార్థుల ఆడ్మిషన్లను 15 శాతానికి మించవద్దనేది ఈ ప్రతిపాదన. అంతేకాదు ఒక్క దేశం నుంచి ఐదు శాతం కంటే ఎక్కువ ఆడ్మిషన్లు ఇవ్వకూడదు. ఉదహరణకు పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ఇండియా నుంచి ఐదు శాతం ఆడ్మిషన్లను భర్తీ చేస్తే అర్హతా ఉన్నా కూడా మిగిలిన ధరఖాస్తుదారులకు ఆ యూనివర్శిటీలో ఆడ్మిషన్లు లభించవు. అండర్ గ్రాడ్యుయేట్ ధరఖాస్తుదారులు కచ్చితంగా ఎస్ఏటీ లేదా ఏసీటీ వంటి పరీక్షలను పూర్తి చేయాలి. విద్యాలయాలను ఇబ్బందిపెట్టేలా రాజకీయ ప్రదర్శనలు నిర్వహించవద్దు. విదేశాల నుంచి అందే నిధుల వివరాలను బయటపెట్టాలి. బాత్ రూమ్ లు, లాకర్ రూమ్ లు స్త్రీ, పురుషులకు వేర్వేరుగా
ఉండాలని నిబంధనలు పెట్టారు. ఈ నిబంధనలు ఎలా అమలు అవుతున్నాయో జస్టిస్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్స్ ద్వారా తెలుసుకోనుంది.
భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ విద్యార్థులే ఎక్కువ. ఇండియా తర్వాతి స్థానంలో చైనా ఉంటుంది. ఇండియా నుంచి వెళ్లే అమెరికా వెళ్లే విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థులు గణనీయంగా ఉంటారు. అమెరికా యూనివర్శిటీల్లో విదేశీ విద్యార్థులకు 15 శాతానికి పరిమితం చేయడంతో భారతీయ విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన యూనివర్శిటీలతో పాటు ఇతర యూనివర్శిటీల్లో ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా ఆడ్మిషన్లు పొందుతుంటారు. కొత్తగా 15 శాతం విదేశీ విద్యార్థులకే ఆడ్మిషన్లు ప్రతిపాదన అమల్లోకి వస్తే ఇది ఇండియన్ స్టూడెంట్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకే దేశం నుంచి ఐదు శాతం విద్యార్థులకు ఆడ్మిషన్ల నిబంధన ఇండియన్ స్టూడెంట్స్ మధ్య పోటీని మరింతగా పెంచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇది ఇండియన్ స్టూడెంట్స్ కు అమెరికాలో ఉన్నత విద్యావకాశాలపై మొండిచేయి చూపే అవకాశం లేకపోలేదు.
అమెరికాలో పడిపోతున్న ఇండియన్ విద్యార్థుల సంఖ్య?
అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఇండియా నుంచి విద్యార్థులు ఎక్కువ మంది వెళ్తుంటారు. అయితే ఇటీవల కాలంలో ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు విదేశీ విద్యార్థులపై ప్రధానంగా ఇండియన్ విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. గత కొంతకాలంగా అమెరికాలో ఇండియన్ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కరోనా తర్వాత ఈ ఏడాదే అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఇలానే ఇండియా నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య 41,192కు పడిపోయింది. ఈ ఏడాది కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమెరికాకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 44.5 శాతం పడిపోయింది. అంతర్జాతీయ సందర్శకుల ఎంట్రీలను ట్రాక్ చేసే అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం 2025 ఆగస్టులో ఎఫ్, ఎం కేటగిరి వీసాల ద్వారా 41,540 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ప్రవేశించారు. కరోనా తర్వాత అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2021 ఆగస్టులో 56 వేలు, 2022లో 80,486, 2023 ఆగస్టులో93,833 మంది అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లారు. అయితే 2024 ఆగస్టులో అమెరికాకు వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ 74,825కు పడిపోయింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్( ఎస్ టీ ఈ ఎం) స్టూడెంట్స్ ఎక్కువగా అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్తారు. 2010 నుంచి 2017 వరకు ఈ సంఖ్య ప్రతి ఏటా పెరిగింది. 2017 నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2017లో అమెరికాకు వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్‌తో పోలిస్తే ఇండియన్ స్టూడెంట్స్ 42 శాతం తగ్గుదల కనిపించింది. 2010లో 15 వేలు, 2011లో 16 వేలు, 2012లో 15 వేలు, 20213లో 13 వేలు,2014లో 14 వేలు, 2015లో 27 వేలు, 2016లో 42 వేలు, 2017లో47 వేల ఎస్టీఈఎం స్టూడెంట్స్ అమెరికాకు వెళ్లారు. ఇక 2017 నుంచి ఈ సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2018లో 36 వేలు, 2019లో 28 వేలు,2020లో27 వేలు, 2021లో 27 వేలు, 2022లో19 వేలకు ఎస్టీఈఎం స్టూడెంట్స్ సంఖ్య పడిపోయింది. ఇక 2024లో (ఎస్టీఈఎంతో కలిపి అన్ని రంగాల్లో చేరిన విద్యార్థుల సంఖ్య) 4.22 లక్షల మంది ఉన్నత విద్యకు అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని ప్రతి నలుగురు విదేశీ విద్యార్థుల్లో ఒకరు భారతీయుడు.
అమెరికాకు కూడా నష్టమే
విదేశీ విద్యార్థుల ద్వారా ప్రతి ఏటా అమెరికాకు వందల డాలర్ల ఆదాయం లభిస్తోంది. యూనివర్సిటీ లివింగ్ ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ 2023–24 ప్రకారం భారతీయ విద్యార్థులు ఒక విద్యా సంవత్సరంలో ట్యూషన్, హౌసింగ్ జీవన వ్యయాల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు దాదాపు 12.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందించారు. ట్యూషన్ ఫీజు రూపంలో ప్రతి ఏటా ఒక్క ఇండియన్ స్టూడెంట్ 7.2 బిలియన్ డాలర్లు అమెరికాకు ఆదాయం వచ్చింది. వసతి కోసం 2.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. 2.4 బిలియన్ డాలర్లను ఇతర ఖర్చుల ద్వారా అమెరికాకు ఆదాయం లభించింది. సగటున ఒక్కో విద్యార్థి అమెరికాలో ఏటా 52 వేల డాలర్లు ఖర్చు చేస్తారని ఈ నివేదిక తెలిపింది. ఆయా కోర్సు, విద్యా సంస్థ ఆధారంగా ఇవి మారే అవకాశం ఉంది. సగటున ఒక్క భారతీయ విద్యార్థి తమ ఉన్నత విద్యాభ్యాసం కోసం 30,000 నుంచి 60,000 డాలర్లను ఖర్చు చేస్తారు. 2025లో ట్యూషన్ ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. సగటున 40,000 నుంచి 45 వేల డాలర్లకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.