Vijayawada | అతనో ప్రభుత్వ ఉద్యోగి.. ఆమె కూడా ప్రభుత్వ ఉద్యోగురాలే. ఇద్దరూ ఉద్యోగస్తులు అని చెప్పి వారిద్దరికి పెద్దలు పెళ్లి చేశారు. కానీ అతను నంపుసకుడు అనే విషయం పెళ్లైన కొద్ది రోజులకే నవ వధువుకు తెలిసింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. నంద్యాలకు చెందిన ఓ యువతి పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తోంది. గతేడాది డిసెంబర్ 26న ఆమెకు కడప జిల్లాకు చెందిన ఓ యువకుడితో ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు. వరుడు విజయవాడలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా పని చేస్తున్నాడు. ఇక పెళ్లి చేసే సందర్భంలో కట్నం కింద రూ. 15 లక్షల నగదు, బట్టల కోసం మరో లక్ష రూపాయాలు ఇచ్చారు. వివాహం రోజు 5 తులాల బంగారం కూడా సమర్పించారు. రిసెప్షన్ రోజున పెళ్లికొడుకు.. పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు.
పెళ్లి కుమారుడి ప్రవర్తనను పక్కనపెట్టి.. అందరూ సర్దుకు పోయారు. ఇక మరుసటి రోజు నుంచి నవ వధువుకు దూరంగా ఉంటున్నాడు. రాత్రి అయ్యే వరకు ఇంటి నుంచి పరార్ అవుతున్నాడు. సంసారం చేయకుండా ముఖం చాటేస్తున్నాడు. సంసారం చేయవా అని నిలదీస్తే.. నిన్ను కేవలం తన తల్లిదండ్రులకు సేవ చేసేందుకే పెళ్లి చేసుకున్నట్లు దబాయించాడు. ఆ తర్వాత గవర్నర్‌పేటలోని తన సోదరుడి ఇంట్లో నవ వధువును వదిలిపెట్టి వెళ్లిపోయాడు. తన భర్త నంపుసకుడని, సంసారానికి పనికి రాడని భార్య గ్రహించింది. పెద్దల సమక్షంలో భర్త, అత్తమామలు, ఇతర బంధువులు, పెళ్లి పెద్దను యువతి కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేసి.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. దీనిపై బాధితురాలు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
