Hyderabad Hotels | దేశాన్ని వంట గ్యాస్ కొరత వెంటాడుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో హోటల్స్ మూసివేయబడ్డాయి. ఆ నగరాల జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం కూడా చేరనుంది. కమర్షియల్ గ్యాస్ నిల్వలు సరిపడా లేకపోవడంతో మరో 48 గంటల్లో హైదరాబాద్‌లోని హోటల్స్ మూసివేసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్స్ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ కోశాధికారి ఎస్ రామ్మూర్తి మాట్లాడుతూ.. పెద్ద పెద్ద హోటల్స్ నెలకు సరిపడా గ్యాస్ నిల్వలను కలిగి ఉంటాయి. కానీ మధ్య, చిన్న తరహా హోటల్స్ కేవలం రెండు రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలను కలిగి ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో 24 నుంచి 48 గంటల్లో హోటల్స్ బంద్ అయ్యే అవకాశం ఉందన్నారు.
సోమవారం నుంచి కమర్షియల్ గ్యాస్ పంపిణీ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న హోటల్స్ కేవలం రెండు రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలను కలిగి ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో 90 శాతం హోటల్స్ మరో రెండు రోజుల్లో మూతపడే అవకాశం ఉందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలోని ఒక్కో హోటల్ మీద 500 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఈ హోటల్స్‌ను మూసివేయడం వల్ల సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. వారు కూడా పస్తులుండే పరిస్థితి దాపురిస్తుందని హోటల్స్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్యాస్ కొరతను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలని కోరుతున్నారు.
