Trump Threatens France : ఫ్రాన్స్‌పై ట్రంప్‌ కన్నెర్ర.. 200 శాతం టారిఫ్‌లు విధిస్తానంటూ బెదిరింపులు

ట్రంప్ సుంకాల వేటు! బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరనన్నందుకు ఫ్రాన్స్ వైన్‌లపై 200% టారిఫ్ విధిస్తానని బెదిరింపు. మాక్రాన్ ప్రైవేట్ సందేశాన్ని లీక్ చేసి సంచలనం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు.

Trump Threatens France

అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తన మాట వినని దేశాలపై ‘సుంకాల’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. టారిఫ్స్‌తో దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటూ అన్ని దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా రష్యాతో వ్యాపారం సాగిస్తున్న భారత్‌ సహా పలు దేశాలపై కొరడా ఝలిపిస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు కారణం చూపి భారత్‌పై అమెరికా దాదాపు 50 శాతం టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఇండియానేకాదు పలు దేశాలు సైతం ట్రంప్‌ ఆగ్రహానికి గురయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి ఫ్రాన్స్‌ వచ్చి చేరింది.

ఫ్రాన్స్‌ దేశంపై ట్రంప్‌ కన్నెర్రజేశారు. గాజా (Gaza)లో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడం, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అమెరికా ‘బోర్డ్ ఆఫ్ పీస్’ (Board of Peace)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గాజాలో పరిస్థితిని పర్యవేక్షించడం, మానవతా సహాయం,
పునర్నిర్మాణం, సంఘర్షణ నివారణకు సంబంధించిన చర్యలను ఈ బోర్డు సమన్వయం చేస్తుంది. ఈ బోర్డులో చేరాలని భారత్‌ సహా పలు దేశాలకు ట్రంప్‌ ఆఫర్‌ చేశారు. అయితే ఈ ప్రతిపాదనపై భారత్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. ఇక ఈ బోర్డులో చేరేందుకు ఫ్రాన్స్‌ విముఖత వ్యక్తం చేసింది. ఫ్రాన్స్‌ నిర్ణయం ట్రంప్‌ ఆగ్రహానికి కారణమైంది.

ఫ్రాన్స్‌పై టారిఫ్స్‌ బెదిరింపులకు దిగారు ట్రంప్‌. ఫ్రాన్స్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వైన్, షాంపైన్‌లపై ఏకంగా 200 శాతం టారిఫ్ (Tariffs) విధిస్తానని హెచ్చరించారు. అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ (Emmanuel Macron) ఖచ్చితంగా దారికి వస్తాడని, బోర్డ్ ఆఫ్ పీస్ (Board of
Peace) లో చేరుతాడని వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు ఆయన చేరాల్సిన అవసరం లేదు అంటూ తన సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అవుతోంది. ట్రంప్‌ బెదిరింపులు యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో ఆందోళనను రేకెత్తించాయి.

అంతేకాదు గ్రీన్‌లాండ్‌కు సంబంధించిన మాక్రాన్‌ నుంచి తనకు వచ్చిన ఓ ప్రైవేట్‌ సందేశాన్ని కూడా ట్రంప్‌ ట్రూత్‌ పోస్టులో పంచుకున్నారు. ఇరాన్‌, సిరియా విషయంలో ఏకాభిప్రాయంలో ఉన్నట్లు ఆ సందేశంలో మాక్రాన్‌ స్పష్టం చేశారు. కానీ గ్రీన్‌లాండ్ విషయంలో మీరు (ట్రంప్‌ను ఉద్దేశించి) ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేద పేర్కొన్నారు. దావోస్‌లో సమావేశం అనంతరం పారిస్‌లో జీ7 సమావేశం ఏర్పాటుచేస్తానని మాక్రాన్‌ తెలిపారు. యూఎస్‌కు వెళ్లడానికి ముందు ఇద్దరం కలిసి డిన్నర్‌ చేద్దాం అంటూ ట్రంప్‌కు మాక్రాన్‌ మెసేజ్‌ పంపారు. ఆ ప్రైవేట్‌ మెసేజ్‌ను ట్రంప్‌ ట్రూత్‌లో పోస్టు చేశారు.

ఇవి కూడా చదవండి :

DGP RamaChandra Rao : సరసాల డీజీపీ అధికారిని సస్పెండ్ చేసిన కర్ణాటక సర్కార్
Mahesh Babu | వారణాసి’పై అంచనాలు పీక్స్‌కి.. శ్రీరామనవమి వేళ మహేష్ బాబు స్పెషల్ లుక్ రిలీజ్‌కు సిద్ధం

Latest News