ర‌న్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

జ‌పాన్ ఉత్త‌ర ద్వీపంలోని హ‌క్కైడోలోని న్యూ చీటోస్ ఎయిర్‌పోర్టు ర‌న్‌వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి

  • Publish Date - January 16, 2024 / 12:54 PM IST

టోక్యో : జ‌పాన్ ఉత్త‌ర ద్వీపంలోని హ‌క్కైడోలోని న్యూ చీటోస్ ఎయిర్‌పోర్టు ర‌న్‌వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేద‌ని జ‌పాన్ అధికారులు వెల్ల‌డించారు. కొరియ‌న్ ఎయిర్ లైన్స్‌, కాథే ప‌సిఫిక్ ఎయిర్‌వేస్ విమానాలు ఢీకొన్న‌ట్లు అధికారులు ధృవీక‌రించారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కొరియ‌న్ ఎయిర్ ఫ్లైట్‌లో 289 మంది ప్ర‌యాణికులు సిబ్బంది ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

అయితే కాథే ప‌సిఫిక్ ఎయిర్‌వేస్ విమానంలో ప్ర‌యాణికులు ఉన్నారా..? లేదా..? అనే విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్ప‌ష్ట‌త రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై కాథే ఎయిర్‌వేస్ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే పొగ‌మంచు కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. కొరియ‌న్ ఎయిర్‌లైన్స్ బ‌య‌ల్దేరేందుకు సిద్ధంగా ఉంది. అయితే పొగ‌మంచు కార‌ణంగా ఆ విమానాన్ని వెనుక‌కు నెట్టేందుకు య‌త్నించిన ఓ టోయింగ్ కారు నేల‌పై జారిప‌డింది. దీంతో కొరియ‌న్ ఎయిర్‌లైన్స్ ఎడ‌మ రెక్క‌.. కాథే విమానం కుడి రెక్క ఢీకొన్నాయని కొరియ‌న్ ఎయిర్ అధికారి తెలిపారు.

Latest News