Mark Zuckerberg | అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పాలనపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కొవిడ్‌కు సంబంధించిన పోస్టులను సెన్సార్ (తొలగించడం) చేయమని జోబైడెన్, కమలా హారిస్ పరిపాలన మెటా బృందాలపై పదేపదే ఒత్తిడి చేసిందని ఆరోపించారు. ఈ విషయంలో తన గొంతును విప్పనందుకు చింతిస్తున్నానని చెప్పారు. యూఎస్ హౌస్ జ్యుడిషియరీ కమిటీకి రాసిన లేఖలో మార్క్ జుకర్‌బర్గ్ ఈ ఆరోపణలు చేశారు. 2021 సంవత్సరంలో బైడెన్, హారిస్ పరిపాలన, వైట్‌హౌస్ అధికారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ నుంచి కొన్ని కొవిడ్-19 సంబంధిత కంటెంట్‌ని తొలగించాలని పదేపదే ఒత్తిడి తెచ్చారంటూ లేఖలో పేర్కొన్నారు. కంటెంట్‌ని తీసివేయాలా వద్దా అనేది అంతిమంగా తమ నిర్ణయం అని జుకర్‌బర్గ్ అన్నారు. మన సొంత నిర్మాణాలకు మనమే బాధ్యత వహిస్తామన్నారు.
ప్రభుత్వం తనపై పెట్టిన ఒత్తిడిని కూడా జుకర్‌బర్గ్ విమర్శించారు. ‘ప్రభుత్వ ఒత్తిడి తప్పు అని నేను నమ్ముతున్నాను. మేము దాని గురించి మరింత గట్టిగా మాట్లాడనందుకు చింతిస్తున్నాను. ఏదైనా పరిపాలన ఒత్తిడి కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మా కంటెంట్ ప్రమాణాలపై రాజీ పడకూడదని నేను గట్టిగా భావిస్తున్నాను. ఇలాంటివి పునరావృతమైతే మేము వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ హౌస్ కమిటీ ఆన్ ది జ్యుడీషియరీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌కి మెటా సీఈవో లేఖ గురించిన సమాచారాన్ని అందించింది. మార్క్ జుకర్‌బర్గ్ మూడు విషయాలను అంగీకరించాడని పేర్కొంది. ‘జోబైడెన్, కమలా హారిస్ పరిపాలన అమెరికన్లను సెన్సార్ చేయమని ఫేస్‌బుక్‌పై ఒత్తిడి తెచ్చిందని.. ఫేస్‌బుక్ అమెరిక్లను సెన్సార్ చేసిందని, ఫేస్‌బుక్ హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్ కథనాన్ని అణిచివేసింది. వాక్ స్వేచ్ఛకు భారీ విజయం’ అని పేర్కొంది. జుకర్‌బర్గ్ లేఖలో 2020 ఎన్నికలకు ముందు బైడెన్ కుటుంబం, బురిస్మా గురించి రష్యన్ తప్పుడు సమచారంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మెటాను హెచ్చరించిందని ఆరోపించారు.