Site icon vidhaatha

US Presidential election । అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక రాష్ట్రాలు.. ఏమిటీ ప్రత్యేకతలు?

US Presidential election । అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా 60 రోజుల సమయం ఉన్నది. 2024 నవంబర్‌ ఐదున పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హ్యారిస్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తమ ప్రచారాన్ని నానాటికీ ఉధృతం చేస్తున్నారు. ప్రత్యేకించి రణరంగ రాష్ట్రాలుగా (battleground) భావించే రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కంటే కమలా హ్యరిస్‌ (Kamala Harris) ముందంజలో ఉన్నారని ఒపీనియన్‌ పోల్స్‌ పేర్కొంటున్నాయి. అయినప్పటికీ.. అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా, స్వింగ్‌ స్టేట్స్‌గా భావించే ఏడు రాష్ట్రాల్లో మాత్రం పోటీ నువ్వా? నేనా? అన్నట్టు ఉన్నది. ఈ ఏడు రాష్ట్రాల్లోని 93 ఎలక్టోరల్‌ ఓట్లు రానున్న రోజుల్లో శ్వేతసౌధం (White House) నుంచి పాలించేదెవరో నిర్ణయించనున్నాయి.

 

ఏమిటీ ఎలక్టోరల్‌ ఓట్లు?

అమెరికాలోని 50 రాష్ట్రాలకు ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను (electoral votes) కేటాయిస్తారు. జనాభాకు అనుగుణంగా వీటి కేటాయింపు ఉంటంది. ఇవి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటాయి. అమెరికాలో ఎలక్టోరల్‌ ఓట్లు మొత్తం 538. దేశాధ్యక్షుడిగా విజయం సాధించాలంటే వీటిలో 270కి తగ్గకూడదు. మొత్తం 50 రాష్ట్రాల్లో ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఎక్కువగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఒక రాష్ట్రంలో అధిక ఓట్లు సాధించిన అభ్యర్థికే ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్‌ ఓట్లన్నీ కేటాయిస్తారు. అలా 270కి తగ్గకుండా ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తాడు.

 

ఏమిటీ స్వింగ్‌ స్టేట్‌?

అటు డెమోక్రటిక్‌ పార్టీ (Democratic), ఇటు రిపబ్లికన్‌ (Republican) పార్టీకి ప్రజాదరణ సమానంగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్‌ స్టేట్స్‌ అని పిలుస్తున్నారు. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో (Presidential election) ఇవే కీలకంగా మారనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం తారుమారైపోతుంది.  అదే సమయంలో రెండు పార్టీలకూ కొన్ని సురక్షిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సదరు రాష్ట్రాల్లో అయితే రిపబ్లికన్‌ పార్టీ లేదంటూ డెమోక్రటిక్‌ పార్టీ పూర్తి ఆధిపత్యంతో ఉంటాయి. వాటిని బ్లూ స్టేట్స్‌ (blue states), రెడ్‌ స్టేట్స్‌ (red states) అని పిలుస్తారు. అయితే.. వీటిలోనూ వివిధ కారణాలతో మార్పులు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.  తాజా ఉదాహరణను గమనిస్తే.. 2020లో బైడెన్‌ (Joe Biden) అనూహ్య విజయానికి, 2022లో డెమోక్రటిక్‌ సెనెటర్‌ రాఫెల్‌ వార్నాక్‌ విజయానికి జార్జియా స్టేట్‌లో వచ్చిన స్వింగే కారణం. నెవెడా, ఆరిజోనా, జార్జియా, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగాన్‌, విస్కాన్సిస్‌ రాష్ట్రాలు ఈ ఏడాది స్వింగ్‌ రాష్ట్రాలనే పేరు పొందాయి.

 

ఆరిజోనా : నైరుతి సరిహద్దు రాష్ట్రమైన ఆరిజోనా(Arizona)లో 11 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. జనాభా లెక్కల్లో మార్పులు, వలసలు ఈ ఏడాది ఈ రాష్ట్రంలో కీలక అంశాలుగా ఉన్నాయి. గతంలో ఆరిజోనా రాష్ట్రంలో డెమోక్రాట్లు ఆధిపత్యంలో ఉండేవారు. కానీ.. 1952 తర్వాత ప్రతి అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు రిపబ్లికన్‌లకు ఓటేస్తూ వచ్చారు. అయితే.. 1996లో డెమోక్రాట్‌ అభ్యర్థి బిల్‌ క్లింటన్‌ (Bill Clinton) ఇక్కడ రిపబ్లికన్‌ల బలానికి గండికొట్టారు. చాలా స్వల్ప తేడానే సాధించినప్పటికీ.. తదుపరి 2020 అధ్యక్ష ఎన్నికల వరకూ ఈ రాష్ట్రం రిపబ్లికన్‌ అభ్యర్థులనే బలపరుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఇక్కడ బైడెన్‌ ఆధిక్యం సాధించారు.

 

జార్జియా : ఆగ్నేయ ప్రాంతంలోని జార్జియా(Georgia)లో 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. 1996 నుంచి 2016 వరకూ ఆరు పర్యాయాలు ఈ రాష్ట్రం రిపబ్లికన్‌ పార్టీ వెంట నిలిచింది. ఈ ఏకఛత్రాధిపత్యాన్ని (single-party dominance) 2020లో డెమోక్రటిక్‌ పార్టీ విచ్ఛిన్నం చేసింది. 1992లో బిల్‌ క్లింటన్‌ తర్వాత 2020లో బైడెన్‌ గెలుపొందారు. బైడెన్‌ విజయంలో నల్లజాతీయులు గత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు.  ఈసారి కూడా వారినే డెమోక్రటిక్‌ పార్టీ నమ్ముకున్నది. పైగా బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకొని కమలా హ్యారిస్‌కు అవకాశం ఇవ్వడం కూడా ఓటర్లలో సానుకూలత పెంచిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

మిషిగాన్‌ : ఎగువన మధ్య పశ్చిమ రాష్ట్రమైన మిషిగాన్‌(Michigan)లో 15 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఒకప్పుడు బ్లూస్టేట్‌గా ఉన్న మిషిగాన్‌.. 1970, 1980 దశకాల్లో డెమోక్రాట్లను గెలిపిస్తూ వచ్చింది. అయితే.. 2016లో ట్రంప్‌ విజయం తర్వాత కీలక స్టేట్‌గా నిలిచింది. కానీ.. 2020లో భారీ మెజార్టీని ఇక్కడ బైడెన్‌ సాధించారు. ఈ క్రమంలోనే కమలా హ్యారిస్‌సైతం మిషిగాన్‌పై ఇటీవల ప్రత్యేకంగా కేంద్రీకరిస్తున్నారు.

 

నెవెడా : అమెరికా పశ్చిమ ప్రాంతంలోని నెవెడా(Nevada)లో ఆరు ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఏడు స్వింగ్‌ రాష్ట్రాలతో పోల్చితే ఇదే అతి తక్కువ. గత నాలుగు ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థుల పక్షానే నిలిచినా.. 1960 నుంచి 2000 సంవత్సరం ప్రారంభం వరకూ రిపబ్లికన్‌లవైపే మొగ్గు చూపింది. 2000లో బిల్‌ క్లింటన్‌ సాధించిన విజయం ఒక్కటి మినహాయింపు. నెవెడాలోని లాటిన్‌ సంతతి ఓటర్లు ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారుతారనే అభిప్రాయాలు ఉన్నాయి.

 

నార్త్‌ కరోలినా :  ఇక్కడ 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. గడిచిన దశాబ్దాలుగా నార్త్‌ కరోలినా (North Carolina) రిపబ్లికన్‌లకే  ఓటు వేస్తూ వస్తున్నది. 2020లో ట్రంప్‌ ఇక్కడ 1.3 శాతం పాయింట్లతో విజయం సాధించడం డెమోక్రాట్లకు ఊతమిచ్చింది. జార్జియా తరహాలో ఈసారి కూడా ఇది తమకు కలిసి వస్తుందని నమ్ముతున్నారు.

 

పెన్సిల్వేనియా : బ్లూ వాల్‌గా పేరుపొందిన పెన్సిల్వేనియా (Pennsylvania)లో 19 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. స్వింగ్‌ స్టేట్స్‌లో (swing states) ఇక్కడే అత్యధికం. 2016లో డెమోక్రాట్ల విజయపరంపరలు ట్రంప్‌ నిరోధించారు. కానీ.. నాలుగేళ్ల తర్వాత పెన్సిల్వేనియా, మిషిగాన్‌, విస్కాన్సిన్‌లలో విజయం సాధించడం ద్వారా బ్లూ వాల్‌ను బైడెన్‌ పునరుద్ధరించుకున్నారు. 2016లో ఈ మూడు రాష్ట్రాల్లో ట్రంప్‌ విజయం సాధించారు. ఇక్కడి శ్వేతజాతి కార్మికులు రెండు పార్టీలకూ అత్యంత కీలకంగా ఉన్నారు. 2016లో ఇక్కడ ట్రంప్‌ విజయానికి వారే కారణం. ఇప్పుడు వారు ఎటువైపు ఉంటారనేది ఫలితాన్ని నిర్ణయించనున్నది.

 

విస్కాన్సిన్‌ : ఇక్కడ పది ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. 2016లో ట్రంప్‌ విజయం సాధించే వరకూ విస్కాన్సిన్‌ (Wisconsin) బ్లూ స్టేట్‌గా పేరుపొందింది.  2024 అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ జూలై ప్రకటనకు రిపబ్లికన్‌లు ఇక్కడి మిల్వాయుకీని ఎంచుకోవడం గమనార్హం. కమలా హ్యారిస్‌ కూడా తొలి ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు.

Exit mobile version