ప్ర‌పంచవ్యాప్తంగా త‌గ్గుతున్న పొగాకు వినియోగం..!

పొగాకు వినియోగానికి (Tobacco Consumption) సంబంధించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) కీలక నివేదిక‌ (Report) ను విడుద‌ల చేసింది

  • Publish Date - January 17, 2024 / 02:40 PM IST

పొగాకు వినియోగానికి (Tobacco Consumption) సంబంధించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) కీలక నివేదిక‌ (Report) ను విడుద‌ల చేసింది. 150 దేశాల్లో పొగాకు వినియోగంలో గ‌ణ‌నీయ‌మైన త‌గ్గుద‌ల క‌నిపిస్తోంద‌ని సంతోషం వ్య‌క్తం చేసింది. అయితే పొగాకు ప‌రిశ్ర‌మ నుంచి దీనిపై గ‌ట్టి ప్ర‌తిస్పంద‌న ఎదురుకావొచ్చ‌ని.. ఆయా దేశాల ప్ర‌భుత్వాలు వీటికి లొంగ‌కూడ‌ద‌ని సూచించింది. మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం.. ప్ర‌స్తుతం 125 కోట్ల మంది పొగాకును వివిధ మార్గాల్లో వినియోగిస్తున్నారు. వినియోగ‌దారుల్లో న‌మోద‌వుతున్న త‌గ్గుద‌ల‌ను దృష్టిలో పెట్టుకుంటే 2025 నాటికి వీరిలో ఒక వంతు మంది పొగాకు నుంచి దూరం జ‌రుగుతారు. అయితే పొగాకు వినియోగాన్ని 2010లో ఉన్న వినియోగ‌దారుల సంఖ్య‌ను 30 శాతం త‌గ్గించాల‌న్న ల‌క్ష్యానికి మాత్రం కాస్త దూరంలో ఉండిపోతున్నామ‌ని డ‌బ్ల్యూహెచ్ఓ వెల్ల‌డించింది.


2000 సంవ‌త్స‌రంలో ప్ర‌తి ముగ్గురు మేజ‌ర్ల‌లో ఒక‌రు ద‌మ్ము కొట్ట‌గా.. 2022లో అది ప్ర‌తి అయిదుగురిలో ఒక‌రిలా మారింది. ‘కొన్ని సంవ‌త్స‌రాలుగా పొగాకు వినియోగానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న పోరాటం స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంది. దీనిని అలుసుగా తీసుకుని ప్ర‌భుత్వాలు విశ్ర‌మించ‌కూడ‌దు. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి లాభాల‌ను దండుకోవ‌డానికి పొగాకు ప‌రిశ్ర‌మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అలా జ‌ర‌గ‌నివ్వ‌కూడ‌దు’ అని డ‌బ్ల్యూహెచ్ఓ (WHO) డైరెక్ట‌ర్ ఆఫ్ హెల్త్ ప్ర‌మోష‌న్ డాక్ట‌ర్ రూయ్‌డిగ‌ర్ క్రెచ్ పేర్కొన్నారు. బ్రెజిల్‌, నెద‌ర్లాండ్ దేశాలు పొగాకు వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేశాయ‌ని పేర్కొంటూ వాటి గురించి ఈ నివేదిక‌లో ప్ర‌స్తావించారు. 2010తో బ్రెజిల్‌లో ధూమ‌పానం చేసే వారి సంఖ్య 35 శాతం త‌గ్గింది.


నెద‌ర్లాండ్స్‌లో ఇది 30 శాతంగా ఉంది. భార‌త్ స‌హా ద‌క్షిణాసియా దేశాల‌ను గ‌మ‌నిస్తే ఈ ప్రాంతంలోనే ఎక్కువ‌మంది పొగాకు వినియోగ‌దారులు ఉన్న‌ట్లు నివేదిక పేర్కొంది. మొత్తం వినియోగ‌దారుల్లో ద‌క్షిణాసియాలో 25.6 శాతం మంది ఇక్క‌డ ఉండ‌గా.. త‌ర్వాత 25.3 శాతం మందితో యురోపియ‌న్ యూనియ‌న్ త‌ర్వాతి స్థానంలో ఉంది. కాంగో, ఈజిప్ట్‌, ఇండోనేషియా, జోర్డాన్‌, ఒమ‌న్‌, రిప‌బ్లిక్ ఆఫ్ మాల్డోవా దేశాల్లో మాత్రం పొగాకు వినియోగం ఆందోళ‌న‌క‌ర స్థాయిలో పెరుగుతోంది. అంతే కాకుండా 13 నుంచి 15 ఏళ్లు మ‌ధ్య వ‌య‌స్కుల్లో పొగాకు, నికోటిన్ వినియోగించే వారి సంఖ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్థిరంగా కొన‌సాగుతోంది. దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల‌ని డ‌బ్ల్యూహెచ్ఓ సూచించింది. నో టొబాకో రోజున నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో బాల‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని పేర్కొంది.

Latest News