Site icon vidhaatha

రాష్ట్రంలో భారీగా తగ్గిన మద్యం వినియోగం

అమరావతి : రాష్ట్రంలో అక్రమ మద్యం అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు అక్రమ మద్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
2019లో 4,500 ఉన్న మద్యం దుకాణాలను 2,934కు తగ్గించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇతర నియంత్రణ చర్యలతో రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని రజత్‌ భార్గవ చెప్పారు. బీరు అమ్మకాలు 70 శాతం, మద్యం అమ్మకాలు 40 శాతం తగ్గాయని ఆయన తెలిపారు. అదే సమయంలో అక్రమ మద్యం వినియోగం పెరగకుండా చూసేందుకు ఎస్‌ఈబీ, విజిలెన్స్‌ విభాగాలతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను తనిఖీలు చేస్తూ వాటి పనితీరును సమీక్షించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ విధానాలతో సానుకూల ఫలితాలను సాధించేలా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి, ఎక్సైజ్‌ శాఖ అదనపు కమిషనర్‌ కేఎల్‌ భాస్కర్‌లతోపాటు అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.

Exit mobile version