Seethakka : మేడారం జాతరకు సీతక్క నృత్యాల జోష్

ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో మంత్రి సీతక్క నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజాప్రతినిధులు, పోలీసులతో కలిసి జాతరకు జోష్ నింపారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం సమక్క, సారలమ్మ జాతరకు రాష్ట్ర మంత్రి సీతక్క జోష్ నింపుతున్నారు. అసలే జోష్ కూ, జోరుకూ, ఉద్విగ్నతకూ, పారవశ్యానికీ, పరవళ్ళు తొక్కే భక్తికి, తమదైన ముద్రవేసే తాదత్యాత్మికతకు ప్రతీకగా నిలిచే మేడారం జాతరకు సీతక్క భాగస్వామ్యం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. మంత్రిగా ఉన్నప్పటికీ ఆదివాసీ జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మలు తమ ఇలవేల్పులు కావడంతో కోయసామాజికవర్గానికి చెందిన సీతక్కకు ప్లస్ గా మారింది. మేడారం జాతర కార్యక్రమాల్లో కీలక భూమిక నిర్వహించే వడ్డెలు(పూజారులు) ఆదివాసీ కోయ తెగకు చెందిన వారే కావడం ఇక్కడ కలిసొచ్చే అంశం. దీంతో జాతర తేదీలు ప్రకటించినప్పటి నుంచి జాతర కార్యక్రమాల్లో నిరంతరం భాగస్వామ్యమవుతున్నారు. సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా నిర్వహించే తంతులతో పాటు, సంప్రదాయ, వారసత్వ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పగిడిద్దరాజు, మండమెలిగే పండుగ, గుడిమెలిగే పండుగలతో పాటు సారలమ్మ రాక సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ఆదివాసీ సంప్రదాయ నృత్యాల్లో పాల్గొన్నారు.

జోష్ నింపుతున్న నృత్యాలు

మేడారం జాతరకు మంత్రి సీతక్క డ్యాన్సులు కొత్త జోష్ నింపుతున్నాయి. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో సాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో మంత్రి కాలుకదుపుతున్నారు. ఇక జాతరలో వనదేవతలను తీసుకొచ్చే క్రమంలో ఆదివాసీలు కొండంత సంబరంతో చేసే సాంప్రదాయ నృత్యాల్లో భాగస్వామ్యమవుతున్నారు. మంత్రి సీతక్క తనతో పాటు తోటి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నారు. కన్నెపల్లి నుంచి సారక్కను తీసుకొచ్చే క్రమంలో ఆదివాసీలతో కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు అధికారులు, సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్రమంలో కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న పురుష పోలీసు ఉన్నతాధికారులు సైతం జోష్ కు లోనై తీన్మార్ స్టెప్పులు వేసి డోలు శబ్దాలకు అనుకూలంగా నృత్యం చేసి హైలెట్ గా నిలిచారు. జాతర సందర్భంగా మేడారం వచ్చిన న్యూజిలాండ్ కు చెందిన మావోరి తెగ ప్రదర్శించిన నృత్యం ఎంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. వారితో పాటు సీతక్క నృత్యం చేసి అలరించారు. జాతర అంతటా సీతక్క భాగస్వామ్యం ఆసక్తికరంగానే కాకుండా సానుకూలంగా మారడంతో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి :

Amazon LayOffs : ఊహించినట్టే జరిగింది.. 16 వేల మందిపై వేటు వేసిన అమెజాన్‌
SIT Issues Notice To KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు

Latest News