Kodi Rama Krishna |తెలుగు సినీ పరిశ్రమలో కోడి రామకృష్ణ పేరు వినగానే భక్తి చిత్రాలు, వినూత్న గ్రాఫిక్స్, అద్భుతమైన కథనశైలి గుర్తుకు వస్తాయి. ఒక తరం ప్రేక్షకులను మాత్రమే కాదు, ‘అరుంధతి’ వంటి చిత్రాలతో నేటి తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న దర్శకుడు ఆయన. తెలుగు సినిమాకే పరిమితం కాకుండా దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలు తెరకెక్కించి తన ప్రత్యేకతను చాటుకున్నారు కోడి రామకృష్ణ. ఇలాంటి లెజెండరీ దర్శకుడు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ తన సినీ ప్రయాణం, గురువు దాసరి నారాయణరావుతో ఉన్న అనుబంధం, అలాగే అప్పటి దిగ్గజ నటుల పనితీరుపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
కోడి రామకృష్ణ మాట్లాడుతూ, తాను దర్శకుడిగా ఎదగడంలో దాసరి నారాయణరావు పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ముఖ్యంగా కష్టపడే తత్వం, నిర్మాతలకు ఇచ్చే గౌరవం, కథను సహజంగా తెరపై చూపించే విధానం ఇవన్నీ దాసరి గారి నుంచే నేర్చుకున్నానని చెప్పారు. డ్రామాను సహజంగా మలచడంలో దాసరి నారాయణరావు అసమానుడని ఆయన కొనియాడారు.
దాసరి గారి పని పట్ల అంకితభావం గురించి చెబుతూ, ఆయనను నిద్రపోతూ తాను ఎప్పుడూ చూడలేదని కోడి రామకృష్ణ అన్నారు. రోజంతా సినిమా ఆలోచనలతోనే గడిపేవారని, తెల్లవారుజామున మూడు గంటల వరకు చర్చలు సాగేవని, ఉదయం ఆరు గంటలకే మళ్లీ షూటింగ్ మొదలయ్యేదని గుర్తు చేసుకున్నారు. దాసరి గారి ఇంటి ముందు ఎప్పుడూ కార్లు నిలిచే ఉండటంతో, ఆ వీధినే “నిత్య కళ్యాణం పచ్చతోరణం రోడ్డు” అని పిలిచేవారని ఆయన ఆసక్తికరంగా తెలిపారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజ నటులు కూడా మేకప్ వేసుకుని, తమ డేట్స్ నోట్ చేసుకోవడానికి దాసరి గారి ఇంటికే వచ్చేవారని చెప్పారు. ఆ కాలంలో దాసరి గారి ఇంటి చుట్టూ ఉండే సందడి ఇప్పుడు ఊహించుకోవడమే కష్టమని అన్నారు.
తాను దాసరి నారాయణరావుకు ఎంతో ఇష్టమైన శిష్యుల్లో ఒకడినని కోడి రామకృష్ణ తెలిపారు. అలాగే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి లెజెండరీ నటులతో పాటు సూపర్ స్టార్ కృష్ణ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. కృష్ణ గారు అత్యంత వేగంగా పని చేసే నటుడని, ఒకే ఏడాదిలో 20కి పైగా సినిమాలు విడుదలయ్యేవని, అవసరమైతే మూడు షిఫ్ట్‌లలో కూడా షూటింగ్ చేసే అసాధారణ శక్తి ఆయనలో ఉండేదని చెప్పారు.
దాసరి గారు కృష్ణకు కథ చెప్పే విధానం కూడా చాలా ప్రత్యేకమని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. కథలోని అసలు కోర్ పాయింట్‌ను ఒకే మాటలో చెప్పగల నేర్పు దాసరి గారికి ఉండేదని, ఆ ముఖ్యమైన పాయింట్ విన్న వెంటనే కృష్ణ గారు కథను ఒకే చేసేవారని వివరించారు. మొత్తంగా చూస్తే, కోడి రామకృష్ణ చెప్పిన ఈ జ్ఞాపకాలు కేవలం వ్యక్తిగత అనుభవాలు మాత్రమే కాదు. అవి అప్పటి తెలుగు సినిమా పరిశ్రమలోని క్రమశిక్షణ, కష్టపాటు, కళ పట్ల ఉన్న నిబద్ధతకు నిలువెత్తు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
