విధాత: నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ తొలి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు పోటాపోటీగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మున్సిపాల్టీని కార్పోరేషన్ గా మార్పించడంతో తొలి మేయర్ పీఠం గెలువడం ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. మెజార్టీ కార్పోరేటర్లను గెలిచి మేయర్ పదవిని సాధించే క్రమంలో ఇప్పటికే తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు.
కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా తన ప్రధాన అనుచరుల్లో ఒకరైన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సతీమణి బుర్రి చైతన్యను ప్రకటించడంతో పాటు కార్పోరేట్ స్థానాల అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వాన్ని ఆరంభించారు. చైతన్య గతంలో కౌన్సిలర్ గా, రామాలయం చైర్మన్ గా పనిచేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం మంత్రి వెంకట్ రెడ్డి తాను నల్లగొండ పట్టణంతో పాటు నియోజకవర్గం అభివృద్దికి చేసిన సేవలను ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 2వేల కోట్ల నిధులను తెచ్చి పట్టణాన్ని ఆదర్శనీయంగా అభివృద్ది చేస్తానని..కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని వెంకట్ రెడ్డి కోరుతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కుమారుడు అమిత్ రెడ్డిలతో కలిసి సాగుతున్నారు. అయితే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నెలకొన్న అంతర్గత వైషమ్యాలను పరిష్కరించి వారందరిని సమన్వయం చేసి గెలిపించుకోవడం మాత్రం వెంకట్ రెడ్డికి సవాల్ గా మారనుంది.
కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు
నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పీఠాన్ని గెలుచుకోవడం ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలని స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పట్టుదలతో పావులు కదుపుతున్నారు. పార్టీలో తనకంటే సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడైన చకిలం అనిల్ కుమార్ సతీమణి వసంతను బీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇచ్చారు. అలాగే కార్పోరేటర్ స్థానాల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించారు. వారి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నితానై కాంగ్రెస్ కు గట్టి పోటీనిచ్చేలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ముందుండి నడిపిస్తున్నారు.
నల్లగొండ పట్టణంలో చకిలం అనిల్ కుమార్ కుటుంబానికి మంచి పట్టు ఉంది. అనిల్ కుమార్ తండ్రి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చకిలం శ్రీనివాస్ రావు పంతులు అభిమానులు, అనుచరులు, పట్టణ వాసులు ఈ ఎన్నికల్లో వసంతకు మద్దతునిస్తారని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. చకిలం వసంత 48వ వార్డు కార్పోరేటర్ అభ్యర్థిగా బరిలోది దిగుతున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉన్న చకిలం అనిల్ కుమార్ గత మూడు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పార్టీ టికెట్ ఆశించారు. అయితే ప్రతిసారి ఆయనకు ఆశాభంగం కల్గింది. చివరకు నల్లగొండ మేయర్ అభ్యర్థిగా తన సతీమణి వసంతకు అవకాశం దక్కడంతో కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటాలని అనిల్ కుమార్ కసరత్తు చేస్తున్నారు. దీంతో మేయర్ పీఠం కైవసం లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య రసవత్తర పోరుకు సాగుతుంది. వసంత అభ్యర్థిత్వం నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ లో చేరిన అనిల్ కుమార్ అనుచరులు కన్నారావు వంటి వారు మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పోటాపోటీగా చేరికల పర్వం ఎన్నికలను మరింత ఉత్కంఠగా మారుస్తుంది.
కింగ్ మేకర్ పాత్రలో బీజేపీ
నల్లగొండ కార్పోరేషన్ తొలి మేయర్ పీఠం సాధించేందుకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటాపోటీగా పోరాడుతుండగా..బీజేపీ సైతం పట్టణ ఓటర్లలో ఉన్న పట్టును ఆసరగా చేసుకుని కార్పోరేషన్ లో కాషాయ జెండా ఎగిరేసే ప్రయత్నం చేస్తుంది. గతంలో నల్లగొండ మున్సిపాల్టీ చైర్మన్ పీఠాన్ని సాధించిన చరిత్ర నేపథ్యంతో పాటు పెరిగిన బీజేపీ బలంపై ఆశలతో మెజార్టీ కార్పోరేట్ స్థానాలు గెలుస్తామని కమలదళం విశ్వసిస్తుంది. అయితే త్రిముఖ పోటీలో మేయర్ పీఠం ఎన్నికలో కింగ్ మేకర్ గా బీజేపీ అవతరించే అవకాశాలు లేకపోలేదంటున్నారు పరిశీలకులు. ఇకపోతే కార్పోరేషన్ ఎన్నికల్లో అన్ని పార్టీలు రెబల్స్ బెడదను ఎదుర్కోంటుండం మరో ఆసక్తికర అంశం. అటు నల్లగొండలో ముస్లిం మైనార్టీ ఓటర్లు, కమ్యూనిస్టులు కూడా గణనీయ స్థాయిలో ఉన్నారు. ఎంఐఎం, సీపీఎం, టీడీపీ పార్టీలు కార్పోరేట్ స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి దించుతు కార్పోరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. మేయర్ పీఠం ఎన్నికలో నిర్ణయాత్మకంగా మారాలన్న వ్యూహంతో ఆ పార్టీలు ఎన్నికల బరిలో దిగుతుండటంతో ఎన్నికలు మరింత పోటాపోటీగా మారిపోయాయి.
ఇవి కూడా చదవండి :
MSG | బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్.. ఓవర్సీస్‌లోనూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రభంజనం
Komatireddy Venkat Reddy vs Punna Kailash : పుర పోరులో… మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ పున్న కైలాష్
