భారత గడ్డపై తాలిబన్ల బరితెగింపు..మహిళా జర్నలిస్టులకు ఘోర అవమానం

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ నిర్వహించిన ఒక సమావేశం యావత్తు దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. తాలిబన్ల అమానవీయ శాసనాలకు ప్రతిరూపంగా ఈ సమావేశంలో మహిళా జర్నలిస్టులను పూర్తిగా నిషేధించడం దేశవ్యాప్త కలకలానికి కారణమైంది

న్యూఢిల్లీ:  దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ నిర్వహించిన ఒక సమావేశం యావత్తు దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. తాలిబన్ల అమానవీయ శాసనాలకు ప్రతిరూపంగా ఈ సమావేశంలో మహిళా జర్నలిస్టులను పూర్తిగా నిషేధించడం దేశవ్యాప్త కలకలానికి కారణమైంది. మహిళల హక్కులను కాలరాసే తాలిబన్ల నీచ సంస్కృతి భారత గడ్డపై అమలు కావడం ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ నిషేధాన్ని భారత ప్రభుత్వం అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమానత్వం, మహిళా సాధికారతకు నిలయమైన భారత్‌లో ఇలాంటి లింగ వివక్ష చర్యకు చోటు కల్పించడం దేశ ప్రతిష్ఠను ప్రశ్నార్థకం చేసింది.

తాలిబన్ల అహంకారం
శుక్రవారం ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముత్తాఖీతోపాటు వచ్చిన తాలిబన్ అధికారులే మహిళా జర్నలిస్టులను నిషేధించే నిర్ణయం తీసుకున్నారు. కేవలం పురుష జర్నలిస్టులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మహిళా జర్నలిస్టులను ఆహ్వానించాలని భారత అధికారులు సూచించినా తాలిబన్ బృందం ఆ సలహాను బేఖాతరు చేసింది. మన దేశంలో సమానత్వ సూత్రాలను ధిక్కరిస్తూ అహంకారంతో తాలిబన్ తీసుకున్న ఈ నిర్ణయం మన గడ్డపై మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే అవుతుందన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

రాజకీయ నాయకుల మండిపాటు..
ఈ ఘటనపై రాజకీయ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మాజీ కేంద్ర హోం మంత్రి పీ చిదంబరం ఈ నిషేధాన్ని గట్టిగా ఖండించారు. మహిళా జర్నలిస్టులను అనుమతించకపోతే పురుష జర్నలిస్టులు బహిష్కరించి ఉండాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తాలిబన్ల వక్రీకరణ..
ఈ సమావేశంలో మహిళల హక్కుల గురించి అడిగిన ప్రశ్నలను ముత్తాఖీ తెలివిగా తప్పించుకున్నారు. ప్రతి దేశానికి తమదైన సంప్రదాయాలు, చట్టాలు ఉంటాయని, వాటిని గౌరవించాలని ఆయన చెప్పారు.