పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో పేలుడు ఘటన కలకలం రేపింది. మంగళవారం స్థానిక కోర్టు సమీపంలో ఓ కారు పేలిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు ఖంగుతిన్నారు. ఈ పేలుడు ఘటనలో 12 మంది మరణించగా పలువురు గాయపడినట్లు పాక్ అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా కోర్టు పనుల కోసం వచ్చిన వారే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో పార్కింగ్ లో ఉన్న కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. కాగా, కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతోనే పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా కథనం ప్రచురించింది. అయితే, పోలీసులు దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. పేలుడు సమయంలో పెద్ద శబ్ధంతో జరిగిందని తెలుస్తోంది.
శుక్రవారం ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ ఫఖ్తున్‌క్వాలోని‘వానా’ నగరంలోని ఆర్మీ ఆధ్వర్యంలోని కళాశాలోని క్యాడెట్లను బందీలుగా తీసుకెళ్లేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీనిని పాకిస్తాన్ దళాలు విఫలం చేసిన తర్వాత ఇస్లామాబాద్ లో పేలుడు సంభవించడం గమనార్హం. కాగా, వానా ప్రాంతం చాలా కాలంగా పాకిస్తాన్ తాలిబాన్, అల్ ఖైదా, ఇతర తీవ్రవాద గ్రూపులకు కేంద్రంగా ఉందని తెలుస్తోంది. అయితే, ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం కారు బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు పాకిస్తాన్ లో కూడా పేలుడు ఘటన జరగడం కలకలం రేపుతోంది.
